ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

18 Jul, 2019 01:45 IST|Sakshi

సాంకేతిక సమస్యల భయంతో నగరానికే పరిమితం

కొత్త బస్సుల కొనుగోళ్లలోనూ మ«థనపడుతున్న ఆర్టీసీ

‘ఫేమ్‌’ రెండో విడత కింద 334 బస్సులనే కోరాలని నిర్ణయం

నేడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న ఆర్టీసీ  

సాక్షి, హైదరాబాద్‌: దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపే విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మల్లగుల్లాలు పడుతోంది. దూర ప్రాంతాలకు నడిపే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏర్పడి మధ్యలో ఆగిపోతే ఎలా అని ఆందోళన చెందుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోళ్లపైనా సంస్థ తీవ్రంగా మ«థనపడుతోంది. దీంతో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి ప్రాంతాల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పాలన్న ప్రతిపాదననూ ఆర్టీసీ విరమించుకుంది.

ఫలితంగా ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌)’పథకం రెండో విడత కింద కేంద్రం పెద్ద సంఖ్యలో బ్యాటరీ బస్సులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పరిమిత సంఖ్యలోనే తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ పథకం కింద 600 బస్సులు మంజూరుకు వీలుగా కేంద్రాన్ని కోరాలని ముందుగా భావించింది. కానీ, హైదరాబాద్‌ మినహా మిగతా ప్రాంతాలకు వాటిని నడిపితే ఏర్పడే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇప్పటికిప్పుడు లేనందున కేవలం 334 బస్సులు మాత్రమే కోరాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు కేంద్రానికి పంపే గడువు గురువారంతో ముగుస్తుండటంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి పంపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి పంపనున్నారు.
 
సమస్యగా చార్జింగ్‌ స్టేషన్లు.. 
ఎలక్ట్రిక్‌ బస్సు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పథకం మొదటి దశ కింద మంజూరై హైదరాబాద్‌లో తిరుగుతున్న ఏసీ బస్సుల ధర ఒక్కోటి రూ.2.40 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 60 శాతం బ్యాటరీదే భారం. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్‌ బస్సులు తయారువుతున్నా.. బ్యాటరీలను మాత్రం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో బ్యాటరీ బస్సులను వాడిన దాఖలాలు లేనందున ఎక్కడా వాటి చార్జింగ్‌ పాయింట్లు లేవు. గతేడాది హైదరాబాద్‌లో 40 బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీంతో వాటి కోసం 3 చోట్ల చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. చార్జింగ్‌ కేంద్రం ఏర్పాటు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్‌లోనే చార్జ్‌ చేసి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా నగరం నుంచి ఇతర పట్టణాలకు వాటిని నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రయాణం మధ్యలో బస్సు బ్యాటరీలో సమస్య తలెత్తితే దాన్ని వెనక్కు తీసుకురావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే తరచూ సమస్యలు తలెత్తితే వాటిని నిర్వహించటం సాధ్యం కాదని తేల్చుకున్న అధికారులు.. వాటిని హైదరాబాద్‌ వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు.

నాన్‌ ఏసీ బస్సులే.. 
ఫేమ్‌ పథకం తొలి దశలో 40 బస్సులు కొన్నారు. అవన్నీ ఏసీ బస్సులే. వీటిని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిప్పుతున్నారు. ఇప్పుడు కొత్తగా నాన్‌ ఏసీ బ్యాటరీ బస్సులే కొనాలని నిర్ణయించారు. వీటి ధర తక్కువగా ఉండటంతో టికెట్‌ ధర కూడా తగ్గనుంది. దీంతో వీటికి సాధారణ ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందనేది అధికారుల ఆలోచన. నగరం, శివారు ప్రాంతాలు, సమీపంలోని చిన్న పట్టణాల వరకు మాత్రమే వీటిని తిప్పబోతున్నారు. వరంగల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే బస్సులను పూర్తిగా సిటీ బస్సులుగానే నడపాలని నిర్ణయించారు.
 
అన్ని చోట్లా సిటీ సర్వీసులే.. 
ప్రస్తుతం దేశంలో ఎక్కడా దూర ప్రాంతాలకు వీటిని నడపటం లేదు. ఢిల్లీ, బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లో ఈ బస్సులు పరుగుపెడుతున్నా.. అన్ని చోట్లా సిటీ బస్సులుగానే తిరుగుతున్నాయి. దూర ప్రాంతాల మధ్య వాటిని ప్రారంభించనందున.. వాటి నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టీసీకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 వేల బస్సులు తిప్పాలని కేంద్రం నిర్ణయించినందున, కొన్ని చోట్ల దూరప్రాంతాల మధ్య తిప్పే అవకాశం ఉంది. అప్పుడు ఆయా సంస్థలకు ఎదురయ్యే అనుభవాలను తెలుసుకుని భవిష్యత్‌లో రాష్ట్రంలో కూడా దూర ప్రాంతాల మధ్య వాటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.

అద్దె బస్సుల వివాదం.. మరో కారణం.. 
ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 25 శాతానికి మించకూడదనేది నిబంధన. కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో దీన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిమితి నిండిపోయింది. కొత్తగా అద్దె బస్సులను ఏర్పాటు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయి కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో అద్దె బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనే బ్యాటరీ బస్సులను అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక సంఘాల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎదుర్కోవటం కూడా ఇబ్బందిగా అధికారులు భావించారు. వెరసి తొలుత 600 బస్సులు సమకూర్చుకోవాలని భావించినా ఇప్పుడు దాన్ని 334కే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఎక్కువ బస్సులు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే అందుకు వీలుగా 550, 450 బస్సులు తీసుకునేలా రెండు ప్రతిపాదనలు కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.  

స్మార్ట్‌ సిటీ బస్సులు.. 

స్మార్ట్‌ సిటీలకు ప్రత్యేకంగా ఈ బస్సులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఉన్న వరంగల్‌ పట్టణంలో కొన్నింటిని ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. 12 మీటర్లు, 9 మీటర్లు, 7 మీటర్ల పొడవుండే 3 కేటగిరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 40 బస్సులు 12 మీటర్ల పొడవైనవే. పాతబస్తీ లాంటి ఇరుకు దారులుండే రోడ్లపై వీటిని నడపడం ఇబ్బందిగా ఉంటుంది. టికెట్‌ ధర కాస్త ఎక్కువగా ఉన్నందున వీటిలో రద్దీ కూడా తక్కువగా ఉంటోంది. అందుకోసం సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చిన్న బస్సులే తిప్పబోతున్నారు. ఇందుకోసం 9, 7 మీటర్ల బస్సులను కూడా కొంటున్నారు. మొత్తం 334 బస్సులు కొనాలని దాదాపు ఖరారు చేశారు. ఇందులో 309 బస్సులను హైదరాబాద్‌లో తిప్పాలని, మిగతా వాటిని వరంగల్‌ పట్టణంలో సిటీ బస్సులుగా తిప్పాలని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు