సమస్యల ‘స్టేషన్‌’

10 Feb, 2018 18:04 IST|Sakshi
జనగామ రైల్వే స్టేషన్‌

కేంద్ర బడ్జెట్‌లో జనగామ రైల్వే స్టేషన్‌కు మొండిచేయి

ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్‌కు ఇవ్వని గ్రీన్‌సిగ్నల్‌

ఆర్వోబీ లేక పట్టాల పైనుంచే ప్రయాణికుల రాకపోకలు

కనీస వసతులు కరువు..ప్రతిపాదనలకే మూడో లైన్‌

సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్‌లో ఎలాంటి నిధులను కేటాయించకపోవడంతో స్టేషన్‌లో సమస్యలు తీరేటట్లు లేవు. ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్‌కు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. హైదరాబాద్‌ నుంచి కాజీపేట వరకు మూడో లైన్‌ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. జిల్లాలో 54 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ విస్తరించి ఉంది. జిల్లా కేంద్రంలోని జనగామ స్టేషన్‌తోపాటు, యశ్వంతాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, పెంబర్తి, నష్కల్‌ స్టేషన్లు ఉన్నాయి. రైల్వే ట్రాక్‌ దాటిపోవడానికి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్డి లేకపోవడంతో ప్రయాణికులతోపాటు పట్టణవాసులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టణాన్ని రైల్వే ట్రాక్‌ రెండు విభాగాలుగా విడదీస్తుంది. స్టేషన్‌కు ఇరువైపులా జనావాసాలున్నాయి. స్టేషన్‌ లోపలి నుంచే ఉన్న ఓవర్‌ బ్రిడ్జి నుంచి అటు ఇటు వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా టీసీ కంటపడకుండా వెళ్లాలి. లేకుంటే టికెట్‌ లేకుండా ప్రయాణించినట్లుగా అనుమానిస్తే మరింత చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి.

కనిపించని కోచ్‌ డిస్‌ప్లే ..
చిన్న స్టేషన్లలో ఉన్న ఈ సౌకర్యం జిల్లా కేంద్రంలోని స్టేషన్‌లో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కోచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన రైలులో మనకు ఏ సీటు కేటాయించారో అదే ప్లాట్‌ఫాంపై నిలబడితే ఆగే రైలు అక్కడే ఆగుతుంది. డిస్‌ప్లే సౌకర్యం లేక పోవడంతో ఎక్కడ ప్లాట్‌ఫాంపై నిలబడినా మన సీటు ఎక్కడ బోగిలో ఉందో చూసుకోవడం కష్టతరంగా మారుతుంది.

బ్రేకులు లేని రైళ్లు..
దూర ప్రాంతాల రైళ్లు ఇక్కడ ఆగడం లేదు. దశాబ్దాల నుంచి ముఖ్యమైన రైళ్లను ఆపాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడకు వెళ్లే శాతవాహన , చైన్నెకి వెళ్లే చార్మినార్, భువనేశ్వర్, ముంబై వెళ్లే కోణార్క్, విశాఖపట్నం, షిర్డీ పోయే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకుండానే పోతున్నాయి.  

మో‘డల్‌’ స్టేషన్‌..
2010లో జనగామ స్టేషన్‌ను మోడల్‌ స్టేషన్‌గా ఎంపిక చేశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కల్పించడం కోసం మోడల్‌ కింద ఎంపిక చేశారు. నిధులను కేటాయించక పోవడంతో స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.  

మూడో లైన్‌కు మోక్షమెప్పుడో?
హైదరాబాద్‌ నుంచి కాజీపేట వరకు 155 కిలోమీటర్ల వరకు మూడో ట్రాక్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి అందించారు. సుమారు రూ.600కోట్ల వ్యయం మూడో ట్రాక్‌ నిర్మాణానికి అవసరమని అంచనా వేశారు. కానీ, బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..
రోజు వేలాది మంది జనగామ స్టేషన్‌ నుంచి రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా
సౌకర్యాలు కల్పించడం లేదు. మూడో లైన్‌కు నిధులు కేటాయించలేదు. –సాధిక్‌ అలీ, జనగామ

మరిన్ని వార్తలు