అలా నెట్టుకొస్తున్నారు!

6 Aug, 2018 01:08 IST|Sakshi

సమాచార, ప్రజాసంబంధాల శాఖలో సిబ్బంది కొరత

కొత్త జిల్లాలకు మంజూరు కాని పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఇబ్బందులతో నెట్టుకొస్తోంది. ఈ విభాగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాల పునర్విభజన వరకు అధికారుల కొరత ఉన్నా నెట్టుకొచ్చారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ఈ కొరత మరింత తీవ్రమైంది. ప్రభుత్వం చేసే ప్రతీ పని, చేపట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువచేసే సమాచార శాఖ పనితీరు కొత్త జిల్లాల్లో ఆశించిన రీతిలో లేదని.. ఆ విభాగంలోనే చర్చ జరుగుతోంది.  

మంజూరు కానీ పోస్టులు...  
కొత్త జిల్లాలకు డిస్టిక్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, అదనపు పీఆర్వో, డివిజన్‌ పీఆర్వో, ఇద్దరు ఆఫీస్‌ అసిస్టెంట్లు, టైపిస్ట్, సీనియర్‌ అసిస్టెంట్, అటెండర్ల పోస్టులు మంజూరు కావాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ పోస్టులను మంజూరు చేయలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో పంపిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అలా ఉండగానే కొత్త జిల్లాలు ఏర్పాటుకావడంతో.. నూతన జిల్లాలకు డివిజన్‌ పీఆర్వోలను ఇన్‌చార్జిలుగా నియమించారు.

రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత సిబ్బందిని నియమించలేదు. ఉమ్మడి జిల్లాలకు డీపీఆర్వోలుగా ఉన్న అధికారులను కొన్ని చోట్ల కొత్త జిల్లాలకు ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు. కొంత మంది డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందినా ఇంకా జిల్లా పీఆర్వోలుగానే పనిచేస్తున్నారు. కాగా, సమాచార, ప్రజాసం బంధాల శాఖలో అధికారుల హోదాలో 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో రెండేళ్లలో 35 శాతం మంది పదవీ విరమణ చేయబోతున్నారు.  

మరిన్ని వార్తలు