సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ వచ్చేదెప్పుడో..?

5 Mar, 2019 16:37 IST|Sakshi
గ్రామ పంచాయతీ కార్యాలయం 

ఇప్పటికీ రాని ఆదేశాలు

గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు

పల్లెల్లో పనులు చేయలేకపోతున్న నూతన సర్పంచ్‌లు

సాక్షి, భువనగిరి : పల్లెలను ప్రగతి బాటలో నడిపిం చాలనే సంకల్పం, ఆరంభంలోనే ప్రజల చేత శభాష్‌ అనిపించుకోవాలనే కోరిక, మహిళలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలనే తపన, వీధి దీపాల ఏర్పాటుతోపాటు తమను నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే ఆశయంతో నూతన సర్పంచ్‌లు  ఇటీవల బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి  నెలరోజులు గడుస్తున్నా సర్పంచ్‌లకు నేటికీ చెక్‌పవర్‌ అందలేదు. దీంతో ట్రెజరీల్లో పంచాయతీ  నిధులు మూలుగుతున్నాయి. కోటి ఆశలతో కొలువుదీరిన  సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ లేకపోవడంతో  గ్రామాల్లోని సమస్యలు ఎక్కడిక్కడే పేరుకుపోతున్నాయి.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలు..
ప్రజల పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం  గిరిజన తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కానీ ఈ పంచాయతీల్లో పలు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.   రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో చేతిపంపులు వట్టి పోతున్నాయి. ప్రధానంగా నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో పాలక వర్గం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు కూర్చుకోవడానికి సైతం కుర్చీలు కొనుగోలు చేద్దామన్నా నిధులు లేకపోవడం శోచనీయం.

 సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ పై  స్పష్టత లేకపోవడంతో నిధులు విడుదల చేయాలంటే సర్పంచ్, గ్రామ కార్యదర్శి పేరు పై  బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరుతో ఉన్న ఖాతాలను  మార్పిడి చేసి ట్రేజరీ కార్యాలయంలో నిషేధించారు. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీల పేరిట ట్రేజరీల్లో అందుబాటులో ఉన్నా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి జాప్యలేకుండా ప్రభుత్వం సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాలకవర్గాలకు  చెక్‌పవర్‌ ఇవ్వాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

 నియోజకవర్గంలో 127 గ్రామ పంచాయతీలు..
భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 127 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మండలంలో 34, భూదాన్‌పోచంపల్లి 22, వలిగొండ 37. బీబీనగర్‌ మండలంలో 34 గ్రామా పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ఇంతవరకు చెక్‌ లేదు. ఆయా గ్రామ పంచాయతీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతోంది.

చెక్‌ పవర్‌పై స్పష్టత ఇవ్వాలి
గ్రామ పంచాయతీ నిధుల వాడకంపై స్పష్టత లేదు. పంచాయతీ కార్యదర్శలే, ఉప సర్పంచ్‌ అనే దానిపై ప్రభుత్వం మార్గ దర్శకాలను  విడుదల చేయలేదు. గ్రామంలో సమస్యను పరిష్కరించుకోవడానికి నిధులు కోసం చెక్‌ పై స్పష్టత లేకపోవడంతో సమస్యగా మారుతుంది. 
– వెంకట్‌రెడ్డి,  సర్పంచ్, పహిల్వాన్‌పురం 

మరిన్ని వార్తలు