చంద్రబాబు మెప్పు కోసమే వ్యాజ్యం

6 Feb, 2019 00:41 IST|Sakshi

హైకోర్టులో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిర్మాత రాకేశ్‌రెడ్డి కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మెప్పు పొందడానికే ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తమ సినిమాపై పిటిషన్‌ దాఖలు చేశారని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిర్మాత రాకేశ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. తమ చిత్రంలోని ‘దగా..దగా.. కుట్ర’ పాటను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్‌టీఆర్‌ను దించేయడానికి ముందే శ్రీశ్రీ రాశారని వివరించారు. ఈ పాటలో చూపినవన్నీ కూడా ప్రజాబాహుళ్యంలో ఉన్నవేనని, చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడని ఎన్‌టీఆరే  స్వయంగా చెప్పారని తెలిపారు. లక్ష్మీపార్వతి, ఎన్‌టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఈ వ్యవహారంలో పుస్తకాలు కూడా రాశారని ఆయన వివరించారు.

పాటపై అభ్యంతరాలుంటే సినిమాటోగ్రఫీ చట్టం కింద ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ సినిమాలోని ‘దగా.. దగా.. కుట్ర’ పాటను యూట్యూబ్, ఇతర సోషల్‌ మీడియా నుంచి తొలగించేలా చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డిని ఆదేశించాలని కోరుతూ టీడీపీ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు నిర్మాత రాకేశ్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ కౌంటర్‌ దాఖలు చేశారు. సినిమా వల్ల తమకు వ్యక్తిగతంగా హాని జరుగుతుందని భావించిన వ్యక్తే కోర్టుకు రావాలి తప్ప, అతని తరఫున మరొకరు వచ్చేందుకు వీల్లేదని పేర్కొన్నారు. ఈ పాట వల్ల నష్టం కలుగుతుందనుకుంటే వారు సివిల్‌ సూట్‌ లేదా పరువు నష్టం కేసు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. 

మరిన్ని వార్తలు