చెరువు నిండె.. చేను పండె!

2 Jun, 2019 05:56 IST|Sakshi

ఆహారధాన్యాల్లో గణనీయమైన అభివృద్ధి

సాక్షి, హైదరాబాద్‌: ఆహా.. ఉత్పత్తి అంటే ఇదీ..! తెలంగాణ పంట పడింది. రికార్డులు కొట్టుకుపోతున్నాయి. చెరువు నిండింది. పొలం పారింది. రైతుకు దిగులు లేదు. పంటకు తెగులులేదు. విత్తనాల కొరతలేదు. ఎరువుల కరువులేదు. ‘రైతుబంధు’ఆదుకుంది. చేనూచెలకా చిద్విలాసం చేశాయి. దిగుబడులు ఎగబడి పెరిగాయి. ఉత్పత్తిలో ఖరీఫ్, రబీలకు తేడా లేదు. తెలంగాణ పల్లెలు గోదావరి జిల్లాలతో పోటీ పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్లుగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారీ పురోగతి కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ ద్వారా వేలాది చెరువులు ఉనికిలోకి రావడంతో సాగునీటి వసతి పెరిగింది. దీంతో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది.   

గోదావరి జిల్లాలతో పోటీ పడి...
కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014–15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 72.18 లక్షల మెట్రిక్‌టన్నులు. అది ఇప్పుడు 91.93 లక్షల మెట్రిక్‌టన్నులకు చేరుకుంది. 2016–17, 2017–18 ఏళ్లల్లో రబీల్లో రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. గోదావరి జిల్లాలతో పోటీపడి ఆహారధాన్యాల ఉత్పత్తి కావడం విశేషం. విచిత్రమేంటంటే... 2014–15 ఖరీఫ్‌లో 44.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలు పండితే, 2016–17 రబీలోనైతే ఏకంగా 49.07 లక్షల మెట్రిక్‌ టన్నులు పండటం విశేషం. గత ఖరీఫ్‌లో వరి దిగుబడి గత 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 41.04 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం (61.57 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం) పండటం విశేషం.  

గతేడాది పత్తి, పప్పుధాన్యాల దిగుబడి ఢమాల్‌...  
గతేడాది పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయింది. 2018–19లో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని నివేదిక తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. 2017–18లో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యా ల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్‌ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు