కోదండ పార్టీ టీజేఎస్‌

25 Dec, 2017 01:27 IST|Sakshi

జనవరిలో ప్రకటించే అవకాశం?

కసరత్తు చేస్తున్న జేఏసీ ప్రతినిధులు..

ఈ నెలాఖరుకల్లా పూర్తికానున్న స్ఫూర్తి యాత్ర

ఆ వెంటనే పార్టీ ఏర్పాటుపై దృష్టి

పార్టీ ఆవశ్యకత, లక్ష్యం, విధివిధానాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయ తెరపైకి కొత్త పార్టీ వస్తోంది! టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం నేతృత్వంలో ఈ నూతన పార్టీ ఆవిర్భవించనుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జనవరి నెలా ఖరులో పార్టీ రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు జరుగు తాయని తెలుస్తోంది. జేఏసీ ముఖ్యులు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరుకల్లా తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రలు పూర్తి కానున్నాయి. అనంతరం పార్టీ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.

జనవరి 1 నుంచి పార్టీ నిర్మాణం
తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయనున్న పార్టీకి ఏ పేరు పెట్టాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ‘తెలంగాణ జన సమితి’(టీజేఎస్‌) పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దాంతోపాటు ‘తెలంగాణ సకల జన సమితి’వంటి మరో రెండు, మూడు పేర్లపైనా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పేరుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జనవరి 1 నుంచి 7 దాకా అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తారు.

అనంతరం టీజేఏసీ కోర్‌ సభ్యులు సమావేశమై.. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, రాజకీయ పార్టీగా అవతరించాల్సిన అవశ్యకత, పార్టీ పేరు, లక్ష్యం, విధి విధానాలు, నిర్మాణం వంటి వాటిపై చర్చిస్తారు. అనంతరం స్టీరింగ్‌ కమిటీ, జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 2009లో ఆవిర్భవించిన టీజేఏసీ.. ఉద్యమకాలంలో తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. మిలియన్‌ మార్చ్, సాగరహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ఉద్యమానికి మార్గనిర్దేశం చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పోరాట మార్గంలోనే పయనిస్తోంది.

ఉద్యమ ఆకాంక్షలే నినాదాలుగా..
తెలంగాణ ఉద్యమ నినాదాలు, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా రాజకీయంగా పనిచేయాలని జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలుగా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయంగా పోరాడేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, వివిధ వృత్తులు వంటి మౌలిక రంగాల అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రాజకీయంగా చర్చకు పెట్టనున్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్ఫూర్తి యాత్రలు చేస్తోంది. నల్లగొండ జిల్లాలో ఇంకా జరుగుతోంది. ఇది పూర్తయితే ఈ యాత్ర దాదాపుగా పూర్తి అవుతుంది. భూనిర్వాసితుల హక్కుల కోసం కూడా జేఏసీ ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది. డిసెంబర్‌ మొదటివారంలో తెలంగాణ నిరుద్యోగ గర్జన నిర్వహించింది. ప్రభుత్వం అనుమతించకపోయినా కోర్టు ద్వారా అనుమతి సాధించి ‘కొలువుల కొట్లాట’సభ నిర్వహించింది.

మరిన్ని వార్తలు