అలుపెరగని ‘అధ్యాపకుడు’!

27 Sep, 2019 10:52 IST|Sakshi
ప్రొఫెసర్‌ భట్టు సత్యనారాయణ

ఓయూలో 20 ఏళ్లు సేవలందించిన ప్రొఫెసర్‌ భట్టు సత్యనారాయణ

‘ఔటా’ అధ్యక్ష, కార్యదర్శిగా ఎనలేని సేవలు  

30న ఉద్యోగ విరమణ సభ హాజరవనున్న రెండు రాష్ట్రాల గవర్నర్లు

ఉస్మానియా యూనివర్సిటీ: ప్రఖ్యాత ఓయూలో 20 ఏళ్లపాటు వివిధ రూపాల్లో సేవలందించి..అలుపెరగని అధ్యాపకుడిగా పేరొందిన ప్రొఫెసర్‌ భట్టు సత్యనారాయణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఓయూ క్యాంపస్‌ సైన్స్‌ కాలేజీ కెమిస్ట్రీ విభాగం అధిపతి(హెడ్‌)గా ఉన్న ఆయన అధ్యాపకులుగా బోధన, పరిశోధనలతో పాటు తన 31 ఏళ్ల సర్వీసులో 20 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా)  అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా రెండుసార్లు కొనసాగారు. వందేళ్ల ఓయూలో దీర్ఘకాలం (20 ఏళ్లు) అధ్యాపకుడిగా వివిధ రూపాల్లో సేవలందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. సర్వీసు మ్యాటర్స్‌తో పాటు అధ్యాపకుల భద్రత, దాడులు జరిగినప్పుడు ప్రొఫెసర్లకు అండగా ఉండడం,  ప్రమోషన్లు, వర్సిటీల బ్లాక్‌ గ్రాంట్స్‌ నిధుల పెంపు, నియామకాలు, భూముల పరిరక్షణ తదితర అంశాలపై సత్యనారాయణ నిరంతరం పోరాడారు. ఆయన ఉద్యోగ విరమణ నేపథ్యంలో వర్సిటీలో అక్టోబర్‌ 4న ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవనున్నారు. 

విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు
ఔటా అధ్యక్షులు ప్రొ.సత్యనారాయణ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలోని రైతుకుటుంబానికి చెందిన లింగయ్య, రాజమ్మ దంపతుల నలుగురు కుమారుల్లో చిన్నవాడు. ఐదు వరకు బొమ్మకల్, పది, ఇంటర్‌ కరీంనగర్, బీఎస్సీ డిగ్రీ వరంగల్‌లోని ఎల్బీ కాలేజీలో పూర్తి చేసి ఓయూలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తొలుత ఇందిరా గాంధీ ఓపెన్‌ వర్సిటీలో అధ్యాపకులుగా పని చేశారు. 1989లో ఓయూలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందారు.కాగా అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తూనే నిత్యం బోధన, పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 పరిశోధన పత్రాలు, 16 మంది పీహెచ్‌డీలు పూర్తి చేయగా మరో 8 మంది విద్యార్థులు తన పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నారు. హెచ్‌సీయూ పాలక మండలిలో రాష్ట్రపతి నామినీ సభ్యులుగా కూడా భట్టు కొనసాగుతున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలపై  తాను సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయని ప్రొ.భట్టు సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు.

మరిన్ని వార్తలు