ప్రశ్నించిన వారంతా అర్బన్‌ నక్సలైట్లేనా? 

7 Jan, 2019 01:26 IST|Sakshi

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ 

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారంతా అర్బన్‌ నక్సలైట్లేనా అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సుకు హాజరై మాట్లాడారు. అర్బన్‌ నక్సలిజం పెరిగిపోతోందని ఇటీవల ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తుండటంపై ఆయన స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా నక్సలైట్లతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. వరవరరావు జైలులో ఉన్నప్పుడు కేసీఆర్‌ నాటి కేంద్ర మంత్రిగా ఆయన్ను కలసి మాట్లాడారని, అంత మాత్రాన కేసీఆర్‌ను అర్బన్‌ నక్సలైట్‌గా పరిగణిస్తామా అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సభ్యత్వం లేని వారిపట్ల కేంద్రం ధోరణి సరికాదన్నారు.

ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని మాత్రమే నిషేధించిందని, సాహిత్యాన్ని, భావజాలాన్ని నిషేధించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని అన్నారు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రశ్నించే గొంతుకలు వస్తుంటాయని, వాటిని అణగదొక్కే క్రమంలో అర్బన్‌ నక్సలైట్లని ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని, ఇందుకు విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీలో హూంకార్‌ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.  సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విద్యాభిమానులు హాజరు కావాలని హరగోపాల్‌ పిలుపునిచ్చారు 

మరిన్ని వార్తలు