హక్కులను కాలరాస్తున్నారు

12 Mar, 2018 01:50 IST|Sakshi

కేసీఆర్‌పై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారంలోకి వచ్చాక పౌర హక్కులను కాలరాస్తున్నారని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిర్బంధంపై ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పిన కేసీఆర్‌ అధికారంలో వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత నిర్బంధం అవసరం లేదన్నారు. గతంలో ఎన్టీఆర్‌ నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వరకు నిర్బంధాన్ని విధించి ప్రజల నుంచి తిరస్కారం పొందిన వారేనని గుర్తు చేశారు. 

సరిహద్దులు దాటి మరీ ఎన్‌కౌంటర్లు
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ ఎన్‌కౌంటర్లు చేస్తుందని హరగోపాల్‌ విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులపై 302 కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర నాయకుడు చిక్కుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మిలియన్‌ మార్చ్‌ కీలక భూమిక పోషించిందని, అలాంటి మిలియన్‌ మార్చ్‌ ఉత్సవాలను కూడా జరుపుకోకుండా నిర్బంధం విధించటం దేనికని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామిక పద్ధతిలో నడవకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పివోడబ్ల్యూ అధ్యక్షురాలు పి.సంధ్యా, సీసీఐ నేత సుధాకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కె.గోవర్ధన్, సీపీఎం నేత డీజీ నర్సింహారావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు