అప్పట్లో ఇలానే ఉంటే తెలంగాణ వచ్చేదా?

20 Jan, 2020 03:09 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ హరగోపాల్‌

ప్రొఫెసర్‌ హరగోపాల్‌

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉమ్మడి రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రావడానికి గల ఉద్యమాలను మర్చిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్లు అవసరం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపా చట్టం కింద అందరినీ అరెస్టు చేస్తే తెలంగాణను సాధించుకునే వారిమా? అని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వమే ప్రజాస్వామికంగా ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.

ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లో (టీపీటీఎఫ్‌) టీడీఎఫ్, టీడీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘాలు విలీనమైన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ కాశింను అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికం అని అన్నారు. వైస్‌ చాన్స్‌లర్‌ అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ చక్రధర్‌రావు, ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ నూతన కమిటీ.. 
తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకటించా రు. అధ్యక్షుడిగా కె.రమణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వై.అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.నారాయణమ్మ, ఎం.రవీందర్, జి.తిరుపతిరెడ్డి, కె.కిషన్‌రావు, రావుల రమేష్, కార్యదర్శులుగా పి.నాగమణి, పి.నాగిరెడ్డి, ఎం.రామాచారి, జె.చంద్రమౌళి, ఎ.రాంకిషన్, కె.కనకయ్య, మాడుగుల రాములు తదితరులు ఎన్నికయ్యారు.

కాశింపై కేసులు ఎత్తివేయాలి
సుల్తాన్‌బజార్‌: విరసం కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కాశింను విడుదల చేసి ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవస్థాపక సభ్యుడు వరహరరావు ఏడాదికి పైగా పూణె జైలులో ఉన్నారని సభ్యులమీద సైతం కేసులు నడుస్తున్నాయని అన్నారు.

ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాల నేతలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లకు నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాల్లో భాగమైన కాశింను అక్రమంగా అరెస్ట్‌ చేయడం తగదన్నారు. ప్రజా సంఘాల బాధ్యులను వరుసగా అరెస్టు చేసి మొత్తం సమాజాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేర, కాశిం తల్లి వీరమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు