రాజకీయ పడగ నీడలో న్యాయవ్యవస్థ 

21 Jan, 2018 03:57 IST|Sakshi

ప్రొఫెసర్‌ హరగోపాల్‌  

హైదరాబాద్‌ : రాజకీయ పడగ నీడలో న్యాయ వ్యవస్థ ఉందని, అందుకే నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా సాక్షిగా బహిరంగంగా ప్రజల ముందుకు రావడం దేశంలో మొదటిసారిగా జరిగిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్ర చివరి దశలో ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉన్నత న్యాయస్థానంపై విశ్వాసం కోల్పోకూడదని న్యాయవాదులు మీడియా ముందుకు వచ్చారని.. ఈ చర్యను పౌరహక్కుల సంఘం స్వాగతిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు కోర్టు ప్రధాన న్యాయముర్తిగా సీనియర్‌ను నియమిస్తారన్నారు.

ప్రభుత్వానికి అనుకూలమైన జడ్జీలను నియమించడం ద్వారా సీనియర్‌ జడ్జీలను పక్కన పెడుతూ కోర్టు సంప్రదాయాలను పాటించడం లేదన్నారు. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు ముంబై హైకోర్టులో విచారణ జరుగుతుండగా దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి తనకు అనుకూలమైన జడ్జీలతో బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని బొంబాయి హైకోర్టు బార్‌ అసోసియేషన్, సుప్రీంకోర్ట్‌ సీనియర్‌ న్యాయవాదులు తప్పుబడుతున్నారని ఆయన వివరించారు. పౌరహక్కుల సంఘం ప్రతినిధి ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. దీపక్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి ఎన్‌. నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రఘునాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జెల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు