త్వరలో వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ

25 Aug, 2016 02:08 IST|Sakshi

నిబంధనలపై కసరత్తు చేస్తున్న అధికారులు
వర్సిటీల వారీగా ఖాళీలపై ప్రతిపాదనల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్‌
: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇటీవల వైస్‌ చాన్స్‌లర్లను నియమించిన ప్రభుత్వం.. వాటిలో అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,528 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నియామక నిబంధనలు ఎలా ఉండాలన్న అంశాలపై దృష్టి సారించింది. అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన నిబంధనలపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యాపకుల నియామకాల నిబంధనలను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై చర్చించారు.

ఆయన ఆదేశాల మేరకు అధికారులు నియామకాల కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 323 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 518 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అయితే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలంటే కచ్చితంగా వైస్‌ చాన్స్‌లర్‌ ఉండాల్సిందే.  ఇటీవల 10 వర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇపుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది.

వర్సిటీల, కేటగిరీల వారీగా ఖాళీలు
యూనివర్సిటీ    ప్రొఫెసర్‌   అసోసియేట్‌ ప్రొఫెసర్‌   అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌     మొత్తం
           
ఆర్‌జీయూకేటీ    23              41                          61                125
శాతవాహన        9                 16                       15                 40
మహాత్మాగాంధీ    10              15                          9                  34
అంబేడ్కర్‌ ఓపెన్‌    8               12                        10                  30
కాకతీయ           53               88                        69                 210
తెలుగు            9                  9                        14                   32
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ    0            7                         22                  29
పాలమూరు     13                21                      50                  84
ఉస్మానియా    147              397                  138                   682
తెలంగాణ    11                   25                      23                    59
జేఎన్‌టీయూహెచ్‌    40           56                107               203
మొత్తం    323                  687                518                     1528

మరిన్ని వార్తలు