కార్పొరేట్‌ స్కూల్‌ బి కేర్ ఫుల్

23 Aug, 2018 08:43 IST|Sakshi
రఘురాం

కుమార్తెను మానసికంగా వేధించిన స్కూల్‌పై న్యాయపోరాటం

విజయం సాధించి స్ఫూర్తిగా నిలిచిన తండ్రి  

పేరెంట్స్‌కి అవగాహన అవసరమంటున్న రఘురాం

సాక్షి, సిటీబ్యూరో : కుమార్తె చదివే స్కూల్‌ యాజమాన్యం అకారణంగా టీసీ ఇచ్చి పంపేస్తే.. ఆ కారణంగా చిన్నారి తీరని మనోవ్యధకు గురై అనారోగ్యం పాలైతే.. ఏం చేయాలి? ఎందుకొచ్చిన గొడవంటూ మరో స్కూల్లో చేర్పించి ఊరుకోవాలా? తమని అంతటి క్షోభకి గురిచేసిన కార్పొరేట్‌ విద్యాసంస్థపై కేసు వేసి న్యాయం కోసం పట్టు వదలక పోరాడాలా? ఈ ప్రశ్నలకు మనలో చాలా మంది మొదటి సమాధానమే వెతుక్కుంటారేమో గానీ.. ఢిల్లీలో నివసించే తెలుగువాడైన రఘురాం మాత్రం అన్యాయం చేసిన పాఠశాలపై అలుపెరగని పోరాటం చేసి గెలిచారు. ఇటీవల వెలుగు చూసిన ఆయన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఎందరో ప్రైవేట్‌పాఠశాలల బాధితుల్లో స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం ఆయన ప్రైవేట్‌ విద్యాసంస్థల చట్టవ్యతిరేకవిధానాలు, తీరుతెన్నులపై ఆగ్రహంగా ఉన్నవారికి దన్నుగా మారారు. మరెందరో తన బాటలోనడిచేందుకు కారణమయ్యారు.

మా పాప  ఢిల్లీలోని ఓ కార్పొరేట్‌  స్కూల్‌లో చదివేది. పేరెంట్స్‌ మీటింగ్స్‌కి నేను అటెండయ్యేవాణ్ని. పలు అంశాలపై యాజమాన్య వైఖరిని తప్పుబట్టేవాడిని.  స్కూల్‌లో అమలు చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులను ప్రశ్నించడంతో యాజమాన్యం నాపై కక్ష పెంచుకుంది. సరైన కారణం లేకుండా నా కూతుర్ని స్కూల్‌ నుంచి పంపేసింది. అనుకోని శిక్షకు మా పాప తల్లడిల్లింది. అనారోగ్యానికి గురైంది’ అంటూ చెప్పారు రఘురాం. ఢిల్లీలో ఇంద్రప్రస్థ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డీన్‌ రఘురాం.. దీనిని అంత తేలికగా వదలదలచుకోలేదు. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. పాప భవిష్యత్తు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నా కార్పొరేట్‌ స్కూల్స్‌కి బుద్ధి చెప్పి మరెందరో పిల్లల తల్లిదండ్రులకు  ఆసరా అందించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విజయం సాధించారు. ఈ  నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. . రఘురాం ఏంచెప్పారో ఆయన మాటల్లోనే..

ఐదేళ్ల పోరాటం..  
ఈ అంశంపై కోర్టులో న్యాయం కోసం ఐదేళ్లు పోరాటం చేశా. ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినా లొంగలేదు. చివరికి  సెషన్స్‌ కోర్టు మా చిన్నారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మా పాపను తరగతి గదిలోకి వెళ్లనీయకుండా బయటే ఉంచినందుకు, ఆమెని 7గంటల పాటు స్కూల్‌లో తరగతులకు హాజరు కానీయకుండా తీవ్రమైన మనోవేదనకు గురిచేసినందుకు.. నష్టపరిహారంగా చెరో రూ.2.5లక్షలు చొప్పున చెల్లించాలంటూ ప్రిన్సిపాల్, స్కూల్‌ డైరెక్టర్‌లను ఆదేశించింది. స్కూల్‌ విద్యార్ఙినులపై ఇప్పటివరకూ వచ్చిన తీర్పులు శారీరక హింస, వేధింపులకు మాత్రమే  పరిమితమయ్యాయి. అయితే తొలిసారి చిన్నారి మనోవేదనకు సైతం విలువిచ్చి న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎందరో తల్లిదండ్రులకు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా కార్పొరేట్‌ స్కూల్స్‌ అవకతవకలపై పేరెంట్స్‌ అవగాహన పెంచుకోవాలి.

వీటిపై దృష్టి పెట్టాలి..
స్కూల్లో అడ్మిషన్ల కోసం ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో పిల్లలకు, పేరెంట్స్‌కి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్ట విరుద్ధం. వీటిని మనం అంగీకరించకూడదు. ఫీజులు ఎక్కువ వసూలు చేసే స్కూల్స్‌ తప్పనిసరిగా ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తున్నాయి. లేకపోతే పేరెంట్స్‌ ఊరుకోరు. పిల్లలకు పర్సనల్‌ అటెన్షన్‌ ఇవ్వలేకే కదా రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం? మరి ఈ మార్కులు ఏమిటి ఇలా వస్తున్నాయి? అంటూ గొడవలకు దిగుతారు. దీంతో ఏదో రకంగా సరిగా చదవని పిల్లలకి కూడా మార్కులు వచ్చేలా చేసేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. యాక్టివిటీ ఛార్జెస్, మిస్‌లీనియస్‌ చార్జెస్‌ అవీ ఇవీ అంటూ సంవత్సరం మొత్తం మీద ఎన్నో  రకాల వసూళ్లు చేస్తున్నారు. రకరకాల రూల్స్‌ పెట్టి వాటిని అతిక్రమించారంటూ పిల్లలకు ఫైన్‌లు అమలు చేస్తున్నారు. ఇటీవల కోల్‌కతాలోని ఒక స్కూల్‌లో పిల్లలు ఆడిడాస్‌ షూస్‌ వేసుకుని రావాలని రూల్‌ పెట్టారు. దీనిపై కోర్టుకి వెళితే... ఆ అధికారం మీ లేదంటూ హైకోర్టు మొట్టికాయలు వేసింది. స్కూల్‌ ఎంబ్లమ్‌ ఉండాలని నిబంధన పెట్టి యూనిఫామ్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటివి తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.   

మరిన్ని వార్తలు