ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి

10 May, 2015 01:33 IST|Sakshi
ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి

ప్రజాసంఘాల నేతల డిమాండ్

హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వివిధ సంఘాల, పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది అయిన సందర్భంగా డాక్టర్ సాయిబాబా విడుదల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపర్చే, ప్రజల పక్షాన పోరాడేవారిపై ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్బంధకాండకు సాయిబాబా అరెస్టు ప్రతీక అని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా ప్రజాస్వామిక ఉద్యమాలను, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను నడపడాన్ని సహించలేకే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.

బయటి ఆహారాన్ని, మందులను అనుమతించకపోవడాన్ని బట్టి సాయిబాబాను జైలులోనే హత్య చేసే కుట్ర సాగుతుందని ఆరోపించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖనటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ సాయిబాబా ఏమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినలా? అని నిలదీశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, రామనర్సింహ్మరావు(సీపీఐ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్ధన్(న్యూడెమెక్రసీ), భూతం వీరయ్య(సీపీఐఎంఎల్),  మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 సామాజిక కార్యకర్తలు కూడా...

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణం విడుదల చేయాలంటూ శనివారం ఢిల్లీ, జవహర్‌లాల్, జామియా మిలియా ఇస్లామియా, ఇంద్రప్రస్థ, అంబేడ్కర్ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలు ఢిల్లీ వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద  దీక్ష చేశారు.
 
 

మరిన్ని వార్తలు