ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ

24 Aug, 2018 01:45 IST|Sakshi

18 శాతం వృద్ధిరేటు సాధించాం: సీఎస్‌ జోషి

ఆఫ్రికా దేశాల ఎడిటర్లతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఆఫ్రికా దేశాలతో సంబంధాలు నెలకొల్పేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి తెలిపారు. ఆఫ్రికాలోని వివిధ దేశాలనుండి వచ్చిన 23 మంది ఎడిటర్లు, జర్నలిస్టుల బృందంతో గురువారం సచివాలయంలో జోషి సమావేశమయ్యారు. భారతదేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిందని, సంక్షేమ రంగం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచిందని వారికి తెలిపారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వృద్ధి రేటు 17 శాతం నుంచి 18 శాతం సాధించామని, దేశంలో ఇది 8 నుంచి 9 శాతం వరకు ఉందని వివరించారు. ఆఫ్రికా ప్రజలతో వివిధ రంగాలలో మరింత మెరుగైన సంబంధాలు, సహకారానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. కఠోర శ్రమతో ఐటీ రంగంలో పురోగతి సాధించామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలను సందర్శించాలని సీఎస్‌ వారిని కోరారు.

మిషన్‌ కాకతీయతో 45 వేల చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని, రైతుబీమా, రైతుబంధు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న పన్నుల విధానం, బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు, చట్టాల తయారీ, ప్రభుత్వాల ఎంపిక, పథకాలు, విద్యాకార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మాట్లాడుతూ ఐటీ, రక్షణ, ఫార్మసీ, సేవలు, పరిశ్రమలు, సేవా రంగాలు ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారికి తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ అర్వింద్‌కుమార్, మీడియా అకాడమీ కార్యదర్శి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు