‘కోట్’ కష్టాలు

24 Oct, 2015 00:13 IST|Sakshi
‘కోట్’ కష్టాలు

- కాల్వలు శిథిలం.. ఆయకట్టుకు అందని నీరు
- లక్ష్యం ఆయకట్టులో సగం కూడా పారని వైనం..
- నిలిచిపోయిన ‘జైకా’ నిధులు
- ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం
- అన్నదాతను ఆదుకోని ప్రాజెక్టు
ధారూరు/ పెద్దేముల్ :
తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని ధారూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన సుమారు 21 గ్రామాల ఆయకట్టుకు నీరందించేందుకు 1967 సెప్టెంబర్ 8న అప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో సాగు విస్తీర్ణ సామర్థ్యాన్ని 9,200 ఎకరాలుగా స్థిరీకరించారు. ధారూరు మండలంలోని ఎడమ కాల్వను 11 కిలోమీటర్ల పొడవు, 1.6 కి.మీ. పొడవుతో బేబీ కెనాల్‌ను నిర్మించారు. పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో 24 కి.మీ. పొడవుతో కుడి కాల్వను నిర్మించారు. మొదట్లో ఈ కాల్వలు చివరి భూములకు సైతం నీరందించి  పొలాలను సస్యశ్యామలం చేశాయి.

కాలగమనంలో కాల్వలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కుడి కాల్వ ద్వారా పొలాలకు సరిగ్గా అందడంలేదు. ఎడమ కాల్వ 4 కి.మీ. వరకే పరిమితమయ్యింది. ఇక బేబీ కెనాల్ సంగతి సరేసరి. ప్రస్తుతం మూడు కాల్వలు కలిసి 4 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నాయి. కాల్వలు శిథిలం కావడం, షట్టర్లను దొంగలెత్తుకెళ్లడం, నీరంతా తూముల్లోంచి బయటకు వెళ్లిపోవడం, కాల్వలకు గండ్లు పడి ఊటవాగు, మేకలోని వాడుకల ద్వారా కాగ్నాలో కలిసిపోతోంది. దీంతో యేటా పచ్చటి పొలాలు బీడులుగా మారుతున్నాయి. దీంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోతుండటంపై వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
రూ.కోట్లు మట్టిపాలు..
ప్రతి యేటా కోట్‌పల్లి ప్రాజెక్టు కాల్వలకు ప్రభుత్వం రూ. కోట్లు కేటాయిస్తోంది. కానీ.. టెండర్ పనులు లేకుండా నామినేటెడ్ పనులు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వినియోగమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 1996లో రూ. 57 లక్షలు కేటాయింపులు జరిగాయి. కానీ నాసిరకం పనులతో కాల్వలు సంవత్సరం తిరక్కుండానే యథాస్థితికి చేరాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రూ. లక్షల్లో మరమ్మతుల పేరిట నిధులు కేటాయిస్తున్న నాసిరకం పనులతో కాల్వలు బాగుపడటం లేదు. 2012, 13లలో రూ. 40 లక్షల చొప్పున కేటాయించినా..  కొంతమంది నాయకులు నిధులు కాజేసి.. పనులు తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.
 
జైకా నిధుల జాడేదీ..?
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రూ. 24.95 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు అప్పటి మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవ కారణంగా మంజూరయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోవడంతో నిధులు విడుదల ఆగిపోయింది. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైకా నిధులతో సంబంధం లేకుండా తాజాగా కాల్వల మరమ్మతుల కోసం ప్రభుత్వమే నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
 
ఎటువంటి ప్రయోజనం లేదు

జిల్లాలో అతిపెద్ద నీటి ప్రాజెక్టు ఉన్నా రైతులకు ఎలాం టి ప్రయోజనం లేకుండాపోయింది. ప్రతి యేటా ప్ర భుత్వం కాల్వల మరమ్మతులకు రూ. కోట్లు ఇస్తున్నా.. ఆశయం నెరవేరడంలేదు. ఎకరా భూమి కూడా తడవడం లేదు.  
- రాములు, రైతు, మంబాపూర్
 
బీడులుగా చివరి భూములు
ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో కొన్ని సంవత్సరాలు చివరి భూములకు నీరందేది. గత 20 ఏళ్లుగా చుక్క నీరూ రావటం లేదు. పచ్చని పొలాలు బీడులుగా మారుతున్నాయి.
- ప్రకాశం, రైతు, మంబాపూర్

మరిన్ని వార్తలు