పట్టాలెక్కని‘గట్టు’!

9 Feb, 2020 04:31 IST|Sakshi

నత్తనడకన సమగ్ర సర్వే పనులు

6 నెలలుగా ప్రభుత్వ పరిశీలనలోనే సర్వే పనుల ఫైలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించే పనులు మూలనపడ్డాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసం 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టు సమగ్ర సర్వే పనులునత్త నడకన సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్‌ రూపొందించేందుకు సర్వే ఏజెన్సీలకు రూ.2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ఫైలు పంపి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ మోక్షం లభించలేదు.

గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్‌ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు 2018 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్‌ రిజర్వాయర్‌ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్‌ నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాథమిక సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. నీటి నిల్వ కోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. 2 మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వాటి సామర్థ్యం ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు. దీని కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాథమిక ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది.

భూసేకరణ అవసరాలను గుర్తించడంతో పాటు అలైన్‌మెంట్‌ ఖరారు చేయాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టుకు నీటిని అందించే అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. సమగ్ర సర్వే చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీకి గతంలో కేటాయించిన రూ. 50 లక్షలను సవరించి రూ.2 కోట్లు కేటాయించాలని ప్రాజెక్టు అధికారులు 6 నెలల కింద ప్రభుత్వ పరిశీలనకు ఫైలు పంపినా ఇంతవరకు దానికి మోక్షం లభించకపోవటంతో సర్వే పనులు చేస్తున్న ఏజెన్సీ సర్వే ప్రక్రియలో వేగం తగ్గించింది. దీంతో ఈ పనులు ఇప్ప ట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు