‘జూరాల’ పునరుజ్జీవానికి అడుగులు!

15 Jun, 2020 04:37 IST|Sakshi

20 టీఎంసీలతో జూరాల ఫోర్‌షోర్‌లో రిజర్వాయర్‌ కోసం ప్రతిపాదన

వరద ఉండే 20 రోజుల్లోనే నీటిని తరలించేలా ప్రణాళిక

ప్రభుత్వం అనుమతిస్తే త్వరలోనే సమగ్ర అధ్యయనం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో ఎగువ నుంచి వరద కొనసాగే రోజులు తగ్గుతుండటంతో వరదున్నప్పుడే ఆ నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బేసిన్‌లో ఎగువన ఉన్న జూరాల నుంచే కృష్ణా వరద జలాలను మళ్లించి నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇప్పటికే రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం జూరాల ఫోర్‌షోర్‌లో 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ప్రతిపాదించగా దీన్ని నీటిపారుదల శాఖ పరిశీలించి ఆమోదం తెలిపింది.

భరోసా ఇచ్చేలా...
జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా లైవ్‌ స్టోరేజీ మాత్రం కేవలం 6.50 టీఎంసీలే. అయితే జూరాలపై దాని సొంత ఆయకట్టుకు అవసరమయ్యే 19.74 టీఎంసీల నీటితోపాటు నెట్టెంపాడుకు 21.42 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌ 5.50 టీఎంసీలు, గట్టు 4 టీఎంసీలు, మిషన్‌ భగీరథ కోసం 4.14 టీఎంసీలు కలిపి మొత్తంగా 73.20 టీఎంసీల అవసరాలున్నాయి. వాటి కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే నెట్టెంపాడు పరిధిలో 11 టీఎంసీలు, భీమా పరిధిలో 8.57, కోయిల్‌సాగర్‌ కింద 2.27, జూరాల కింది రిజర్వాయర్లలోని నీటి నిల్వలతో కలిపి మొత్తం 28 టీఎంసీల మేర మాత్రమే నిల్వ చేయగలిగే రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద కొనసాగుతున్న రోజులు తగ్గుతూ వస్తుండటంతో ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రవాహాలు పూర్తిగా రానప్పుడు తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా జూరాలకు నీటి లభ్యత పెంచడం, దానిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా జూరాల పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్తం తెరపైకి తెచ్చింది. రిటైర్డ్‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, ఖగేందర్, మహేందర్‌ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్‌లో ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించి జూరాల ఫోర్‌షోర్‌లోని నాగర్‌దొడ్డి వద్ద 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదించింది. 

వరదతో నింపి... ఆగగానే వదిలి
జూరాలకు కుడిపక్క ఫోర్‌షోర్‌లో కేవలం కిలోమీటర్‌ దూరంలో ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. వరద ఉండే 20 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించేలా ఒక పంపుహౌస్‌ నిర్మించి దాని ద్వారా రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళిక వేశారు. దీనికి రూ. 5,200 కోట్లు అంచనా కట్టారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తే గతం లో రూ. 554 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన గట్టు ఎత్తిపోతల పథకం అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. వరద ఉండే రోజుల్లో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్‌ నింపుకొని, జూరాలలో నీటి నిల్వలు తగ్గితే మళ్లీ రిజర్వాయర్‌ నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ జూరాలకు నీటిని విడుదల చేసి నింపేలా ఈ ప్రతిపాదన సిద్ధమైంది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ ఈ ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలని కోరుతూ ఈఎన్‌సీకి లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేస్తామని ప్రతిపాదించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు