హైదరాబాద్‌ టు వరంగల్‌.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌

12 Nov, 2019 03:12 IST|Sakshi

యాదాద్రి, జనగామ, వరంగల్‌లో మూడు ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల ప్రతిపాదన

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ద్వారా అభివృద్ధికి ప్రభుత్వం వినతి

హైదరాబాద్‌ ఫార్మాసిటీకి రూ. 3,418 కోట్ల గ్రాంటు కోసం లేఖ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నూతన పారిశ్రామిక విధానంలో ఆరు ఇండస్ట్రియల్‌ కారిడార్ల అభివృద్ధిని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు (పారిశ్రామిక వాడలు) ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–మంచిర్యాల, హైదరాబాద్‌–నల్లగొండ, హైదరాబాద్‌–ఖమ్మం ఇండస్ట్రియల్‌ కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఆయా జిల్లాల్లో లభ్యమయ్యే సహజన వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అయితే తొలి దశలో వరంగల్, నాగ్‌పూర్, బెంగళూరు కారిడార్ల అభివృద్ది చేయాలని, మరో మూడు కారిడార్లను రెండో దశలో అభివృద్ధి చేయాలని నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్‌)లో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌–వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కారిడార్‌ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.  

వరంగల్‌ కారిడార్‌కు అధిక ప్రాధాన్యత 
ప్రస్తుతం 163వ నంబరు జాతీయ రహదారిని రూ.1,905 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. మరోవైపు ఎన్‌ఐటీతో సహా పలు సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలకు వరంగల్‌ నగరం కేంద్రంగా ఉండటంతో ఐటీ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం ఉందని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ రూ.11,586 కోట్లతో ఏర్పాటయ్యే మెగా టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా 1.13 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరుకు మైసూరు శాటిలైట్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసిన తరహాలో హైదరాబాద్‌–వరంగల్‌ కారిడార్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం హైదరాబాద్‌ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్టు (ఎన్‌ఐసీడీఐటీ) ద్వారా మౌలిక సదుపాయాల కోసం రూ.3,418 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐటీ క్లస్టర్ల మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసిన తర్వాత కారిడార్‌ అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ కారిడార్‌ ద్వారా ఫార్మా, ఐటీ, రవాణా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఊతం లభించనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా