వన సంపదను కాపాడుకోవాలి..

30 Dec, 2014 02:16 IST|Sakshi
వన సంపదను కాపాడుకోవాలి..

జన్నారం/కడెం : కవ్వాల అభయారణ్యంలోని వన సంపదను కాపాడుకోవాలని.. అది అందరి బాధ్యత అని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం అటవీ డివిజన్‌లోని మైసంపేట, మల్యాల, పాండవాపూర్ తదితర అడవుల్లో పర్యటించారు. ఉద యం 5.30 గంటలకే ఆయన అడవులకు చేరుకున్నారు. అటవీ జంతువులైన దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పి తదితర వాటిని చూసి ఆనందించారు.

అనంతరం అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వన్యప్రాణుల విభాగాన్ని అభివృద్ధి చేయాల్సినా అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలకతీతంగా బాధ్యత తీసుకుని.. ఇక్కడ పలువురికి ఉపాధి దొరికేలా చూడాలన్నారు. కవ్వాల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిందన్నారు. గ్రామాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పరిస్థితిని వివరించి అవగాహన కల్పిస్తే వారంతట వారే అడవులు వదిలి బయటకు వస్తారని, ప్రభుత్వం నుంచి ఫలాలు వారికి అందేలా కృషి చేయాలని కోరారు.

తాను గతంలోనూ ఇక్కడ పర్యటించానని, కవ్వాల్ అభయారణ్యాన్ని మరింత అభివృద్ధి చేసేలా సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఆయన వెంట డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, టైగర్‌కన్జర్వేషన్ అథారిటీ సభ్యుడు ఇమ్రాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ హరినాయక్, కడెం ఎఫ్‌ఎస్‌వోలు నజీర్‌ఖాన్, కింగ్‌ఫిషర్, ఎఫ్‌బీవోలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం జిల్లా కో కన్వీనర్ రియాజోద్దీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముజాఫర్‌అలీఖాన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, తదితరులు సన్మానించారు. అలాగే.. కడెం అటవీ క్షేత్రంలోని గంగాపూర్, లక్ష్మీపూర్ సెక్షన్ అడవుల్లోనూ ఆయన పర్యటించారు.

>
మరిన్ని వార్తలు