ఆమెకు రక్ష

18 Jul, 2019 02:56 IST|Sakshi

బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం యోచన 

సాక్షి, హైదరాబాద్‌: సర్వైకల్‌ కేన్సర్‌ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కేన్సర్‌ విస్తరణ, అరికట్టాల్సిన అవసరంపై ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి డాక్టర్లు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ చేర్చాలని సూచించారు. అంతేకాదు, ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సర్వైకల్‌ కేన్సర్‌ స్క్రీనింగ్‌పై తరగతులను నిర్వహించనున్నారు. కేన్సర్‌ను సులభంగా గుర్తించే (డయాగ్నైజ్‌) పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళలను బాధిస్తున్న రోగాల్లో సర్వైకల్‌ కేన్సర్‌ ఒకటి. మన దేశంలో ప్రతి సంవత్సరం 60 వేల మందికి పైగా ఈ కేన్సర్‌తో మరణిస్తున్నారు. ఏటా సగటున 97 వేల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలోనూ సర్వైకల్‌ కేన్సర్‌ ప్రభావం ఉంది. నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌లో భాగంగా చేపడుతున్న సర్వేలో సర్వైకల్‌ కేన్సర్‌ స్క్రీనింగ్‌ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు 7 వేల అనుమానిత కేసులను గుర్తించారు. దీనిపై గతంలో ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి బృందాలు పలు ప్రాంతాల్లో స్క్రీనింగ్‌ నిర్వహించి, వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించాయి.

సెక్సువల్‌ ఇన్‌ఫెక్షన్‌తో సోకే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) సర్వైకల్‌ కేన్సర్‌కు దారితీస్తుంది. ఈ వైరస్‌ను టీకాలతో కంట్రోల్‌ చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే బాలికలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా సర్వైకల్‌ కేన్సర్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఈ టీకాపై ఉన్న అపోహతో ఇప్పటివరకు ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఇటీవల ఈ టీకాను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ షెడ్యూల్‌లో చేర్చింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు