సమస్యలపై ఆందోళనలు ఉధృతం

21 Nov, 2018 17:39 IST|Sakshi

ఏఐటీయూసీ అడ్వైజర్‌ దమ్మాలపాటి

సింగరేణి(కొత్తగూడెం): గత అసెంబ్లీ ఎన్నికల ముందు, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ అడ్వైజర్‌ దమ్మాలపాటి శేషయ్య ఆన్నారు. మంగళవారం ఏరియాలోని జీకేఓసీ గని వద్ద ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ హామీల అమలు కోసం ఈనెల 3న, 16వ తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం, డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.

అయినప్పటికీ యాజమాన్యంలో చలనం లేదని, అందుకే యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఓసీలలో బొగ్గు నాణ్యతకు ఇన్సెంటివ్‌  జతచేయటం సరైందికాదని, నాణ్యత తో ప్రమాణం లేకుండా కార్మికులకు ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో 10వ వేజ్‌బోర్డు అమలు నాటి నుంచి  చెల్లించాలని ఏఐటీయూసీ స్టాండరైజేషన్‌ సమావేశంలో మాట్లాడామన్నారు. డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో ఇప్పటి వరకు రెండు సమావేశాలు జరిగాయని, మళ్లీ ఈనెల 27న వారణాసిలో సమావేశం జరుగనుందని, ఈ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో సముద్రాల సుధాకర్, ఏ వీరమణ, ఎంవీరావు, ఎస్‌.వెంకటేశ్వర్లు, వట్టికొండ ప్రసాద్, ఎస్‌.శ్రీనివాస్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు