రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తాం

27 Jun, 2014 23:17 IST|Sakshi
రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తాం

రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు త్వరలో నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్‌తో కలిసి వ్యవసాయ, విద్యుత్తు శాఖలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి 200 మెగావాట్ల విద్యుత్తు సరఫరా కానుందని, దీంతో కోతలకు ఉపశమనం కలుగనుందన్నారు. వినియోగం అధికంగా ఉన్నందునే విద్యుత్తు కొరత ఏర్పడిందన్నారు. వర్షాలు కురిస్తే విద్యుత్ సరఫరా కొంత మెరుగుపడుతుందని చెప్పారు.

జిల్లాలో నిర్మాణంలో ఉన్న 9 సబ్‌స్టేషన్లను త్వరితంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ మండలాలైన బషీరాబాద్, పెద్దేముల్, మోమిన్‌పేట్ మండలాలకు వెంటనే ఏఈలు నియమించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్‌కు సూచించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతానికి ఇన్‌చార్జిలను నియమించి కొత్త నియామకాల కోసం సీఎండీతో మాట్లాడతానన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జేడీఏ విజయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఇంజనీర్లు విద్యాసాగర్, బాలకృష్ణ, పర్వతం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు