'రేపటికల్లా అన్ని ఆస్పత్రుల్లో స్వైన్ ప్లూ మందులు'

21 Jan, 2015 16:26 IST|Sakshi
'రేపటికల్లా అన్ని ఆస్పత్రుల్లో స్వైన్ ప్లూ మందులు'

హైదరాబాద్: స్వైన్ఫ్లూ తీవ్రతను అరికట్టేందుకు పర్యవేక్షణ నిమిత్తం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారి, జీహెచ్ఎంసీ పరిధిలోని 5 జోన్లకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. గురువారం రాత్రికల్లా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో స్వైన్ఫ్లూ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండి స్వైన్ఫ్లూ పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

స్వైన్ఫ్లూ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. యాభై వేల ట్యాబ్లెట్లు, 10 వేల సిరప్‌లు, రోగ నిర్ధారక పరీక్షలు చేసే యంత్రాలు పంపించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రికల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బృందం, మందులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

సీఎస్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని, ప్రతి జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో స్వైన్ఫ్లూ మందులు అందుబాటులో ఉంచుతామని కేసీఆర్ చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో యుద్ధప్రాతిపదికన పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతామన్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.

మరిన్ని వార్తలు