సూడో డాక్టర్ల స్పూఫింగ్‌ దందా!

29 Jun, 2018 02:17 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న సీపీ అంజనీకుమార్‌. చిత్రంలో షికా గోయెల్‌ తదితరులు

సెంట్రల్‌ కోటాలో మెడిసిన్‌ పీజీ సీట్లంటూ ఎర 

కేంద్ర సంస్థ పేరుతో స్పూఫ్డ్‌ ఈ–మెయిల్స్‌ సృష్టి 

వీటితో మెయిల్స్‌ పంపి అందినకాడికి స్వాహా 

వీరిపై 4 రాష్ట్రాల్లో 16 కేసులు 

కుంభకోణం రూ.కోట్లలో ఉంటుందని అనుమానం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ సంస్థల పేరుతో స్పూఫ్డ్‌ మెయిల్స్‌ సృష్టించి నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్లను రూ.కోట్లకు ముంచిన ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, 11 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అదనపు సీపీ, సీసీఎస్‌ డీసీపీలు షికా గోయల్, అవినాష్‌ మహంతితో కలసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సంతోష్‌రాయ్, మనోజ్‌కుమార్‌ పాథక్, సునీల్‌కుమార్‌ మెహతో, అమిత్‌ కుమార్‌ స్నేహితులు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో సూడో డాక్టర్ల అవతారమెత్తారు. డాక్టర్లుగా నకిలీపత్రాలు సృష్టించి ఢిల్లీలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అయితే, ఈ దందాలో నష్టాలు రావడంతో రూటు మార్చారు. మెడిసిన్‌ పీజీ సీట్ల దందాకు పూనుకున్నారు. సీట్లు ఇప్పిస్తామంటూ వైద్యులకు భారీ మొత్తంలో టోకరా వేసేందుకు పథకం వేశారు. పీజీ వైద్య సీట్ల వివరాల కోసం ఇంటర్‌నెట్‌లోని వివిధ ఫోరమ్స్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారి ఫోన్‌ నంబర్లు సేకరించారు.  

ఎంట్రన్స్‌లతో పని లేదంటూ... 
ఎలాంటి ఎంట్రన్స్‌ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వ పూల్, ఎన్‌ఆర్‌ఐ కోటాల్లో భారత్, నేపాల్‌లోని ప్రముఖ కళాశాలల్లో మెడిసిన్‌ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ ఈ ముఠా తమ ఫోన్‌ నంబర్‌తో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపింది. ఆకర్షితులై స్పందించినవారితో మాట్లాడి తొలుత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పేరుతో డీడీ కట్టించింది. నమ్మకం పొందిన తర్వాత ముఠాసభ్యులే నేరుగా బాధితులున్న ప్రాంతాలకు వెళ్లి ఈ డీడీతోపాటు దరఖాస్తులు తీసుకునేవారు. ఆపై ఇంటర్‌నెట్‌లో ఉన్న స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌ను ఆశ్రయించేవారు. నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకమున్నాయి. దీనిలోకి ఎంటర్‌ అయిన తరవాత మెయిల్‌ అందుకోవాల్సిన వ్యక్తి ఈ–మెయిల్‌తోపాటు దాన్ని అందుకున్నప్పుడు ఏ మెయిల్‌ ఐడీ డిస్‌ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి తనకు ప్రభుత్వరంగ సంస్థల నుంచే ఈ–మెయిల్‌ వచ్చినట్లు భావిస్తాడు.  

దఫదఫాలుగా భారీగా దండుకుని... 
పీజీ మెడిసిన్‌ సీట్లు ఆశించినవారిని మోసం చేయడానికి ఈ ముఠా(addir@mohfw.nic.in, noreply @mohfw.nic.in, www.rguhs. ac. in) తదితర మెయిల్స్‌ స్పూఫింగ్‌ చేసింది. దీంతో వారు తమకు ఆయా కళాశాలల్లో సీట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ ద్వారానే వచ్చినట్లు భావించేవారు. ఇలా పూర్తిగా వలలో పడినవారి నుంచి ఒక్కో సీటుకు రూ.కోటి వరకు వసూలు చేసి తమ సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుంటారు. దాదాపు ఏడాది కాలంలో ఈ గ్యాంగ్‌ హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబైలో మోసాలు చేయడంతో 16 కేసులు నమోదయ్యాయి. సిటీకి చెందిన వైద్యురాలు ఫాతిమా రజ్వీ కుమార్తెకు పీజీ మెడిసిన్‌ సీటు ఇప్పిస్తామని రూ.81 లక్షలు, ఢిల్లీలోని రాజేంద్రనగర్‌కు చెందిన మరొకరి నుంచి రూ.68 లక్షలు దండుకున్నారు. ఫాతిమా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ చక్రవర్తి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా, ఎస్సై డి.మదన్‌ గౌడ్‌ దర్యాప్తు చేశారు. ఢిల్లీలో నిందితుల ఆచూకీ గుర్తించారు. సంతోష్‌ రాయ్, మనోజ్‌కుమార్‌లను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. మిగిలినవారు తప్పించుకున్నారు. పోలీసులు వీరికి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. స్కామ్‌ రూ.కోట్లలో ఉంటుందని, దర్యాప్తు చేస్తున్నామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు