గజరాజులకు మానసిక ఒత్తిడి!

18 Aug, 2019 01:47 IST|Sakshi

తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్ధ్యం

లాకోన్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఆలయాల్లో ఊరేగింపులకు, పర్యాటకుల విహారానికి, అటవీ ఉత్పత్తుల తరలింపునకు ఏనుగులను ఎక్కువగా వాడటం, వాటిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అనుబంధ సంస్థ లాకోన్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన శిక్షణ లేని మావటీల కారణంగా అవి హింసకు గురవుతున్నట్లు వారు వెల్లడించారు. తద్వారా ఒత్తిడి పెరిగి వాటి ప్రవర్తనపై ప్రభావం పడుతోందని, సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగుల జాతి దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే ఈ ఒత్తిడిని తగ్గించాలని లాకోన్స్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.ఉమాపతి నేతృత్వంలో జరిగిన పరిశోధన స్పష్టం చేస్తోంది. ఆసియా ప్రాంతంలో 20 శాతం ఏనుగులు నిర్బంధంలో ఉన్నాయని, ఒత్తిడి కారణంగా 1993 – 2003 మధ్యకాలంలో దాదాపు 274 మందిపై ఏనుగులు దాడులు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో లాకోన్స్‌ శాస్త్రవేత్తలు వేర్వేరు పరిస్థితుల్లో గజరాజుల ఆరోగ్యం, ఒత్తిళ్లపై పరిశోధనలు చేపట్టారు. మైసూరు జంతు సంరక్షణాలయంతోపాటు మధుమలై, బాంధవ్‌గఢ్‌ ఎలిఫెంట్‌ క్యాంపుల్లోని 870 ఏనుగుల వ్యర్థ నమూనాలను పరిశీలించారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల్లో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మతపరమైన కార్యక్రమాల్లో ఏనుగులను వీలైనంత తక్కువగా వాడాలని, పునరుత్పత్తి చేయగల వయసులో ఉన్న ఆడ ఏనుగులను అసలు వాడరాదని శాస్త్రవేత్తలు సూచించారు. గజరాజులతో పనులు చేయించేందుకు మరింత సులువైన, హింసకు తావివ్వని పద్ధతులు పాటించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు