సానుభూతి వద్దు.. న్యాయం చేయండి

2 Dec, 2019 05:35 IST|Sakshi

నక్షత్ర కాలనీ వాసుల ఆందోళన

శంషాబాద్‌: ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ ఘటనపై దేశప్రజలంతా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు ఎందుకు మెదపడం లేదని శంషాబాద్‌ పట్టణం లోని గేటెడ్‌ కమ్యూనిటీ నక్షత్ర కాలనీ వాసులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాజకీయ నాయకుల పరామర్శలతో ఒరిగేదేమీ లేదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం కావాలన్న డిమాండ్‌తో ఆదివారం ఉదయం వారు కాలనీ గేటును మూసేశారు.

గేటుకు ‘నో పొలిటీషియన్స్‌.. నో పోలీస్‌.. నో మీడియా.. నో సింపతి.. ఓన్లీ యాక్షన్‌’అంటూ బోర్డులు తగిలించారు. గేటు సమీపంలోకి వచ్చిన కొందరు నాయకులను అడ్డుకున్నారు. దీంతో సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి గేటు వద్దనే కాలనీ వాసులతో మాట్లాడి వెళ్లిపోయారు. మధ్యాహ్నం వరకు మీడియాను కూడా గేటు పరిసరాల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాము మీడియాను అడ్డుకోవడం లేదని పోలీసులు ఎందుకు ఆపుతున్నారని కాలనీ వాసులు ప్రశ్నించడంతో తిరిగి గేటు వద్దకు మీడియాను అనుమతించారు. 

>
మరిన్ని వార్తలు