‘ఛత్తీస్ విద్యుత్’పై బహిరంగ విచారణ

23 Jan, 2016 22:09 IST|Sakshi
‘ఛత్తీస్ విద్యుత్’పై బహిరంగ విచారణ

ఫిబ్రవరి 11న నిర్వహిస్తామని ప్రకటించిన ఈఆర్‌సీ
 
 సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై బహిరంగ విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు సింగరేణి భవన్‌లోని తమ కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఒప్పందంపై విద్యుత్‌రంగ నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఒప్పందానికి సవరణలు జరిపాకే ఆమోదం కోసం తమ వద్దకు తేవాలని ఈఆర్‌సీ గతేడాది నవంబర్‌లోనే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించింది. ఈఆర్‌సీ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో డిస్కంలు బేఖాతరు చేశాయి. రాతపూర్వక ఆదేశాలిస్తేనే ఒప్పందంలో సవరణల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో మిన్నకుండిపోయాయి. దీనిపై 2 నెలలకుపైగా జాప్యం జరగడంతో ఈఆర్‌సీ వెనక్కి తగ్గింది.

 ఒప్పందంపై అనేక అభ్యంతరాలు...
 లోపాల పుట్టగా ఉన్న ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్‌రంగ నిపుణుడు, తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు, విద్యుత్‌రంగ కార్యకర్త ఎం.తిమ్మారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు, రిటైర్డు ఇంజనీర్ నారాయణరెడ్డి ఈఆర్‌సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. ఈ ఒప్పం దంపై బహిరంగ విచారణ జరపాలని టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ఈఆర్‌సీకి వినతిపత్రం సమర్పిం చారు.

విచారణ జరపాలని ఈఆర్‌సీ తాజాగా నిర్ణయించినా పిటిషన్‌దారులకు డిస్కంల నుంచి లిఖి తపూర్వకంగా వివరణలు అందలేదు. తమ అభ్యంతరాలపై డిస్కంల వివరణల పట్ల అభిప్రాయాన్ని తెలుపు తూ జరిగే బహిరంగ విచారణ లో పిటిషన్‌దారులు ఈఆర్‌సీ చైర్మన్, సభ్యుల బెంచ్ ఎదుట వాదనలు వినిపించనున్నారు. దీనిపై డిస్కంల ప్రతివాదనలూ విన్నాక ఒప్పందం భవితవ్యంపై ఈఆర్‌సీ ఆదేశాలివ్వనుంది. పిటిషన్‌దారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఒప్పందంలో సవరణలు జరపాలని ఈఆర్‌సీ ఆదేశిస్తే రాష్ట్ర డిస్కంలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మేరకు సవరణలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ సర్కారు ఒప్పుకోకపోతే ఈ ఒప్పందం మరుగునపడనుంది.

 ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై ప్రధాన అభ్యంతరాలివే..
► ఛత్తీస్‌గఢ్‌కన్నా తక్కువ ధరకు విద్యుత్ విక్రయించే ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ సంస్థలు చాలా ఉన్నా ఛత్తీస్‌గఢ్ నుంచే ఎందుకు కొంటున్నట్లు?
► విద్యుత్ చట్టం ప్రకారం విద్యుత్ ధరల నిర్ణయాధికారం రాష్ట్ర ఈఆర్‌సీకే ఉండాలి. కానీ ఛతీస్‌గఢ్ ఈఆర్‌సీకి ఎందుకు కట్టబెట్టారు ?
► ఏ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తారో కనీసం సూచనప్రాయంగా కూడా తెలపకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?
► విద్యుత్ కొనుగోలు చేసినా చేయకున్నా రూ. వందల కోట్ల స్థిర చార్జీలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధనలు ఎందుకు ఉన్నాయి?
► విద్యుత్ ఉత్పత్తికి వాడే బొగ్గును ఎక్కుడ్నుంచి తెస్తారో కూడా ఒప్పందంలో పేర్కొనలేదెందుకు?
► విద్యుత్ అమ్మకం ధరను రాష్ట్ర సరిహద్దుల వద్ద కాకుండా ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి సంస్థ సరిహద్దుల వద్ద నిర్ణయించేలా ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

మరిన్ని వార్తలు