‘ఆశ’.. నిరాశ!

17 Aug, 2015 02:45 IST|Sakshi
‘ఆశ’.. నిరాశ!

- పొట్టనింపని పారితోషికం
- అర్ధాకలితో అలమటిస్తున్న ఆశ వర్కర్లు
అల్లాదుర్గం రూరల్:
ప్రజలకు వైద్యసేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆశ వర్కర్లను నియమించింది. పల్లెల్లో వైద్య సేవలపై అవగాహన కల్పించడంతోపాటు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల టార్గెట్లు పూర్తిచేయడం, గర్భిణులను అసుపత్రులలో డెలివరీ చేయించడం, చిన్న పిల్లలకు ఇంజక్షన్లు చేయించడం వంటి పనులు ఆశ వర్కర్లతో ప్రభుత్వం చేయిస్తోంది. బాధ్యతలు ఫుల్‌గా ఆప్పగించిన ప్రభుత్వం వారికిచ్చే పారితోషికం మాత్రం అరకొరే. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, అందోల్ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వందకు పైగానే ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు.

విధులను సక్రమంగా నిర్వహిస్తున్నా ప్రభుత్వం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ వర్కర్ల విధులకు, ఇచ్చే పారితోషికానికి పొంతన లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడటం వీరి ముఖ్య విధి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం ఆయ్యో వరకు అశ వర్కర్లే చూసుకోవాల్సి ఉంటుంది. గర్భిణుల వివరాలు అందించినప్పుడు రూ.60, గర్భిణులను ఏడు నెలల వరకు అసుపత్రికి తరలించడం..  వైద్య పరీక్షలు చేయించడం.. టీటీ ఇంజక్షన్ ఇప్పిస్తే రూ.250, ప్రభుత్వ అసుపత్రిలో వెంట ఉండి ప్రసవం చేయిస్తే రూ.300 ఇస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తే ఒక్కరికి రూ.150 చొప్పున చెల్లిస్తారు.

ఏడాదికి రెండు సార్లు నిర్వహించే పల్స్‌పోలియో కార్యాక్రమానికి మూడు రోజులు పని చేయించుకుని రూ.225 మాత్రమే చెల్లిస్తారు. గ్రామాలలో జనన, మరణ వివరాలు, క్షయా వ్యాధి నిర్ధారణ, ఇమ్యునైజేషన్, వ్యాధులు, పారి శుద్ధ్యంపై అవగాహన, కుటుంబ సర్వే, కీషోర బాలికల సర్వే, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇన్ని సేవలను చేయించుకుంటూ జీతాలు మాత్రం ఇవ్వడం లేదని ఆశవర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
 
కనీస వేతనం చెల్లించాలి
ఆశ వర్కర్లకు పారితోషికం కాకుండా కనీస వేతనం నెలకు రూ.15 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఎన్‌ఎంలకు ఇచ్చే సదుపాయాలు కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. - రేణుకా ఆశ కార్యకర్త, అల్లాదుర్గం
 
ఏఎన్‌ఎంలుగా నియమించాలి

అర్హులైన ఆశ కార్యకర్తలను ఏఎన్‌ఎంలుగా నియమించాలి. ఏఎన్‌ఎంల విధులను తామే నిర్వహిస్తున్నాం. 6 నెలలు శిక్షణ ఇచ్చి గ్రామాలలో ఏఎన్‌ఎంలుగా నియమించాలి.
 - సత్యమ్మ, ఆశ కార్యకర్త,  రేగోడ్

>
మరిన్ని వార్తలు