నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి

30 Oct, 2019 02:57 IST|Sakshi

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి మారిన వేదిక 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్‌నగర్‌ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. 

స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... 
సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్‌నగర్‌ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్‌ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఉధృతంగా నిరసనలు.. 
హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు.  ఆర్మూర్‌లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్‌పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్‌ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు.

నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్‌ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్‌కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 

‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ 
ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. 

షరతులతో హైకోర్టు అనుమతి
ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు