టీఆర్‌ఎస్... శిక్షణ

24 Feb, 2015 04:35 IST|Sakshi

 నల్లగొండ : ప్రభుత్వ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడం...శాసనసభ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ వేదికగా ప్రజాప్రతినిధులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 7వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా... అంతకంటే నాలుగు రోజుల ముందుగా అంటే 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీలో చాలామంది ప్రజాప్రతినిధులు తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే ఉన్నారు.
 
 దీంతో ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే అభిప్రాయం పార్టీలో ఉంది. వృద్ధులకు ఆసరా ఫించన్లు, సన్నబియ్యం, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారు. దీంట్లో ఆసరా పింఛన్లు రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచినప్పటికీ ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆహార భద్రత పథకం ద్వారా రూ.1 సన్నబియ్యం అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు...ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లో కూడా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న భావన కేసీఆర్‌లో ఉంది.
 
 అదే విధంగా అధికారులతో ప్రజాప్రతినిధుల వ్యవహరించే తీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. అవినీతిని అంతమొందిస్తామని సీఎం కేసీఆర్ వేధికల మీద చెప్తున్నప్పటికీ  క్షేత్రస్థాయిలో వాటి ఆనవాళ్లు ఇంకా కనిపిస్తున్నానే ఉన్నాయి. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కుపెట్టే సందర్భంగా అధికార పార్టీ తరఫున దీటుగా ఎదుర్కోని పక్షంలో మరింత లోకువయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన సీఎం సమావేశాలకు ముందు శిక్షణ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు.
 
 కదిలిరానున్న ప్రభుత్వం..
 రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం వారంతా సాగర్ చేరకుంటారు. 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు ముగించుకుని 5వ తేదీ రాత్రి తిరుగు ప్రయాణమవుతారు. శిక్షణ తరగతుల ఏర్పాట్ల గురించి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు