ప్రగతి చక్రానికి పంక్చర్

4 Mar, 2015 03:20 IST|Sakshi

రికార్డు స్థాయి నష్టాల్లో ఆర్టీసీ ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లోనే రూ. 931 కోట్లు హాంఫట్

ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థగా గిన్నిస్

రికా ర్డు సృష్టించిన ఆర్టీసీ... ఇప్పుడు నష్టాలు మూటగట్టుకోవడంలోనూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. 75 ఏళ్ల చరిత్రలో 2013-14లో అత్యధికంగా రూ. 902 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ..

ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మరింతగా ఊబిలో కూరుకు

పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 931.77 కోట్ల నష్టాలను చవిచూసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఈ నష్టం రూ. 1,100 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది.

- సాక్షి, హైదరాబాద్

ఠీ డీజిల్ దెబ్బ..

ఇప్పటికే నష్టాల తో కుదేలవుతున్న ఆర్టీసీపై డీజిల్ బాంబు పడింది. పన్నులతో కలుపుకొని ఒక్కసారిగా రూ. 4 వరకు పెరగటంతో ఆర్టీసీపై వార్షిక లెక్కన రూ. 230 కోట్ల భారం పడింది. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగానే కొనసాగుతున్న ఆర్టీసీ రోజూ సగటున 16 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ లెక్కన తాజా పెంపుతో రోజువారీ అదనపు భారం రూ. 64 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇంతకుముందే తెలంగాణలో లీటర్ డీజిల్‌కు రూ. 2 చొప్పున అదనపు మొత్తాన్ని చెల్లించాలన్నప్పుడే భరించలేమంటూ ఆర్టీసీ చేతులెత్తేసింది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నా... వ్యాట్‌ను పెంచడంతో ఆ భారం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు తాజా పెంపు వల్ల భారం మరింతగా పెరగడంతో... తమను ఆదుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఠీ ఏపీ నుంచి ఎక్కువ!

 

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ఫిబ్రవరి నెల వరకూ రూపొందించిన ఆదాయ-వ్యయాల పట్టికను రూపొందించారు. దానిని పరిశీలించి ఈ పదకొండు నెలల కాలంలోనే ఆర్టీసీ రూ. 931.77 కోట్ల నష్టాలను చవిచూసినట్లు గుర్తించి కంగుతిన్నారు. ఈ లెక్కన ఈసారి నష్టాలు రూ. 1,100 కోట్లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల్లో సింహభాగం ఆంధ్ర ప్రదేశ్ నుంచే వచ్చింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రం నుంచి రూ. 573.56 కోట్లు. తెలంగాణ పరిధిలో రూ. 358.21 కోట్లుగా నష్టం వచ్చినట్లుగా తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలో నష్టాలు ఎక్కువగా వస్తుండగా... ఒక్క జనవరిలో మాత్రం తెలంగాణ కంటే తక్కువగా రూ. 4.48 కోట్ల నష్టం మాత్రమే వచ్చింది. రెండేళ్లలో ఒక నెలలో ఇంత తక్కువ నష్టం రావటం ఇదే మొదటిసా రి. ఈ నెలలో తెలంగాణ పరిధిలో నష్టాలు రూ. 12.47 కోట్లుగా నమోదయ్యాయి.

ఠీ పట్టించుకోని ప్రభుత్వాలు..

 

ఆర్టీసీ 75 ఏళ్ల చరిత్రలో 2013-14లో అత్యధికంగా రూ. 902 కోట్ల నష్టాలు వచ్చాయి. దానిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోకపోవడంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విభజన అనంతరం ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీలో సంస్కరణల జోలికి వెళ్లకపోవడంతో నష్టాలు తార స్థాయికి చేరుతున్నాయి. ఇరు ప్రభుత్వాలు కూడా కేవలం మొక్కుబడిగా అధికారులను వివరాలు అడగడం తప్ప సమీక్షలు నిర్వహించడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాలు పెరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటున్నప్పటికీ నష్టాలు రావడానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నా... ఎవరూ పట్టించుకోవటం లేదు. విభజన నేపథ్యంలో అంతర్గతంగా అధికారుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలతో వారెవరూ పరిస్థితిని పట్టించుకోవటానికి ముందుకు రావటం లేదు. ఆర్టీసీ విభజనకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నందున.. దిద్దుబాటు చర్యలకు అవకాశం కనిపించడం లేదు. అయితే ఇటీవలే ఆర్టీసీ బాధ్యతలు స్వీకరించిన సాంబశివరావు పరిస్థితిని కొలిక్కి తెచ్చే యత్నం చేస్తున్నా... ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవటం గమనార్హం.

మరిన్ని వార్తలు