వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్‌!

26 Dec, 2019 18:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్‌ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)ను ఆశ్రయించారు. 

వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్‌ డిస్క్‌ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్‌కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్‌ డిస్క్‌ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్‌లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్‌ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్‌ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో..  ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం,  ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో  సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్‌పై పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా