‘పిటీ’ బస్ డిపో

1 Jul, 2014 02:07 IST|Sakshi
‘పిటీ’ బస్ డిపో

కరీంనగర్‌లో సిటీ బస్ డిపో ఏర్పాటు, నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా 70 సిటీ బస్సుల కొనుగోలుకు గ్రహణం పట్టింది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసిన రూ.25.85 కోట్ల ప్రాజెక్టు కాగితాల్లోనే నిలిచిపోయింది. రాష్ట్ర విభజన పరిణామాలు, కొత్త ప్రభుత్వాల ఏర్పాటుతో ఆర్టీసీ అధికారులు ఈ ఫైల్‌ను పక్కన పెట్టారు. సిటీ బస్ డిపోకు అవసరమైన స్థలం కేటాయించి ప్రతిపాదనలు పంపించటంతోపాటు బస్సులు కొనుగోలు చేయాల్సిన ఆర్టీసీ యంత్రాంగం అంతగా దృష్టి సారించకపోవటంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలటం లేదు. కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రతినిధులు అటువైపు దృష్టి సారించకపోతే.. సిటీ బస్ డిపో ఏర్పాటు కాగితాల్లోనే అటకెక్కే ప్రమాదముంది.

- రూ.25.85 కోట్ల ప్రాజెక్టు  
- ఆర్టీసీ ఫైళ్లలోనే హాల్టింగ్ విభజన తర్వాత నత్తనడక   
- బస్సుల కొనుగోలు ఎప్పుడు?
- ప్రజాప్రతినిధులు పట్టించుకోకుంటే అంతే..

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంగా కరీంనగర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే నగర జనాభా ఇంచుమించుగా మూడు లక్షలకు చేరింది. దీనికి తోడు వివిధ అవసరాలపై ప్రతి రోజు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులు జిల్లా కేంద్రానికి వచ్చి వెళుతున్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం నగరంతో పాటు కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని పరిసర గ్రామాలు చుట్టుముట్టేలా ఆరు లోకల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. కానీ.. సరైన ప్రచారం, సిటీ బస్ స్టాపులు, సమాచార సూచికలు, నిర్ణీత వేళాపాళా లేకపోవటంతో ఇవన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి.

అదే సమయంలో ఆటోలు, ప్రైవేటు వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం తప్పనిసరిగా మారింది. శివారు ప్రాంతాలను కలుపుతూ.. సిటీ బస్సులు నడిపితే నగర ప్రజలకు, విద్య, ఉద్యోగాలు, ఇతరత్రా అవసరాలకు నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇదే క్రమంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా రాష్ట్రంలోని పలు చిన్న పట్టణాలకు సిటీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీ కేంద్రానికి సమగ్ర నివేదికలు సమర్పించారు. వరంగల్, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, నంద్యాల, కరీంనగర్, రామగుండం, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయనగరం పట్టణాలకు కలిపి మొత్తం 12 ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగానే అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ను కలిసి కరీంనగర్‌కు ప్రాధాన్యమివ్వాలని ఒత్తిడి చేశారు.

ఎట్టకేలకు కరీంనగర్‌కు బస్‌డిపో ఏర్పాటు, 70 బస్సుల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ అధికారులు రూ.26.35 కోట్లు ప్రతిపాదిస్తే.. రూ.25.85 కోట్లకు మంజూరీ లభించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 13 పట్టణాలకు మంజూరు ఇవ్వగా రాష్ట్రంలో కేవలం కరీంనగర్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో మన జిల్లాకు మాత్రమే ఈ ప్రాజెక్టు మంజూరైంది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రజాప్రతినిధులు చొరవ చూపితే.. నగర వాసులకు సిటీ బస్సుల కల నెరవేరుతుంది.

మరిన్ని వార్తలు