అవగాహన కల్పిస్తూ..నాప్‌కిన్లు అందిస్తూ..

22 Feb, 2018 07:45 IST|Sakshi
సంధ్య

ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ

58 స్కూళ్లలో వెండింగ్‌ మెషిన్ల ఏర్పాటు

వ్యక్తిగత శుభ్రతపై విద్యార్థినులకు అవగాహన

‘ప్యూర్‌ ఫౌండేషన్‌’ సేవలు

‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలలో వారం రోజులు బాలికల హాజరు తక్కువగా ఉండడం గమనించాం. ఇందుకు కారణం ఏంటని విశ్లేషిస్తే... స్కూళ్లలో టాయ్‌లెట్స్, డిస్పోసల్స్‌ లేకపోవడం, నీళ్లు రాకపోవడం తదితరకారణాలతో విద్యార్థినులు నెలసరి సమయంలో పాఠశాలకు రావడం లేదని తేలింది. దీనిపై మా టీమ్‌ అంతా కలిసి ఆలోచించాం. శానిటరీ ప్యాడ్స్‌ అందజేయాలని ‘ప్యూర్‌ ఫెమ్‌’ ప్రోగ్రామ్‌ను ఐదు నెలల క్రితంప్రారంభించామ’ని చెప్పారు సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ప్యూర్‌ (పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌) ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సంధ్య గొళ్లమూడి. ఈ మంచి పనికి శ్రీకారం చుట్టిన సంధ్య...
‘నేను శక్తి’ శీర్షికతో తమ సేవలను వివరించారు.

సాక్షి, సిటీబ్యూరో  : మా స్వస్థలం పశ్చిమ గోదావరి. ప్రస్తుతం నగరంలోని సన్‌సిటీలో నివాసం. మా ఆయన బ్యాంక్‌ ఉద్యోగి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చేది. ఆ సమయంలో అక్కడి పిల్లలకు నావంతుగా చదువు చెప్పేదాన్ని. ఈ క్రమంలో ఖమ్మంలోని ఓ పాఠశాలలోని పిల్లలు పుస్తకాలు కొనుక్కునే స్థోమత లేక చదువు మానేయడం గమనించాను. ఈ పరిస్థితిపై నా స్నేహితురాలితో చర్చించగా, తాను అక్కడి పిల్లల కోసం పుస్తకాలు, స్టేషనరీ, ప్లేట్లు, గ్లాస్‌లు ఉచితంగా అందజేసింది. అయితే ఇంకెంతో మంది పేద విద్యార్థులు, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కదా! మరి అక్కడ పరిస్థితి ఏంటనే ఆలోచన నన్ను తొలిచేసింది. విద్యాభివృద్ధికి నావంతు సహకారం అందించేందుకు మరికొంత మంది స్నేహితులతో కలిసి ‘ప్యూర్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించాను. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ, స్కాలర్‌షిప్స్‌ అందజేయడం, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం తదితర మా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నాం.   

ఇదీ ‘ప్యూర్‌ ఫెమ్‌’ ఉద్దేశం...  
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్‌ వినియోగాన్ని వివరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. రుతుక్రమం సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో..? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. నాప్‌కిన్లు అందజేస్తున్నాం. అవి కూడా సహజ సిద్ధంగా తయారు చేసిన నాప్‌కిన్లనే ఇస్తున్నాం. ఏలూరులోని ‘ఆశ జ్యోతి’ సంస్థ ఆధ్వర్యంలో అరటి నార, కాటన్‌లతో ప్రకృతి సహజంగా రూపొందిస్తున్న శానిటరీ ప్యాడ్స్‌ను ‘పరి ప్యాడ్స్‌’ పేరుతో విద్యార్థినులకు అందజేస్తున్నాం.

రూ.5కు రెండు...   
విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్‌ కోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా వెండింగ్‌ మెషిన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 58 స్కూళ్లలో వీటిని అందుబాటులో ఉంచాం. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్‌ పరిధిలోని 18 పాఠశాలలు, రాజేంద్రనగర్‌ మండలంలోని 14 పాఠశాలలు ఉన్నాయి. ఈ మెషిన్లలో రూ.5 కాయిన్‌ వేయగానే రెండు న్యాప్‌కిన్లు వస్తాయి. సోషల్‌ మీడియా వేదికగానే మేం నిధులు సేకరిస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు కొందరు స్పాన్సర్‌ చేసేందుకు ముందుకొస్తున్నారు. 

మరిన్ని వార్తలు