ప్రపంచ రికార్డు సాధించిన పూర్ణ

17 Feb, 2019 03:21 IST|Sakshi

తాజాగా అకాన్కాగో పర్వతారోహణ  

4 ఖండాల్లో 4 ఎత్తైన శిఖరాలు అధిరోహించిన తొలి గిరిజన యువతిగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బిడ్డ మలావత్‌ పూర్ణ రికార్డులు మీద రికార్డులు సాధిస్తోంది. చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తాజాగా మరో ప్రపంచ రికార్డు సాధించింది. శుక్రవారం అర్జెంటీనాలోని అకాన్కాగో శిఖరాన్ని(6,962 మీటర్లు) అధిరోహించింది. ఇప్పటివరకు ఆమె నాలుగు ఖండాలలోని నాలుగు ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన అనంతరం పూర్ణ మాట్లాడుతూ తెలంగాణ, ఇండియా గర్వపడేలా ప్రపంచంలో ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని పేర్కొంది. సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎవరెస్ట్‌ కంటే అకాన్కాగో అధిరోహించడం చాలా కష్టతరంగా అనిపించింది.

అప్పుడు ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్న స్వేరోస్‌ టెన్‌ కమాండ్‌మెంట్స్‌ గుర్తు చేసుకున్నాను. ఇప్పటివరకు ఎవరెస్ట్‌(ఆసియా), కిలిమంజారో(ఆఫ్రికా), ఎల్‌బ్రూస్‌(యూరప్‌), అకాన్కాగో(దక్షిణ అమెరికా) పర్వతాలు అధిరోహించాను. ఇకముందు డెనాయ్‌(నార్త్‌ అమెరికా), విన్సన్‌ మసిఫ్‌(అంటార్కిటికా), కాస్కిజ్కో(ఆస్ట్రేలియా) పర్వతాలను అధిరోహించడమే నా ధ్యేయం’అని తెలిపింది. గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ చిన్న వయసులో పూర్ణ ఇలాంటి ఘనత సాధించడం చాలా గొప్పవిషయమని, ఆమె సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

మరిన్ని వార్తలు