16 లేదా 17న సమావేశం పెట్టండి

14 Oct, 2017 02:54 IST|Sakshi

 కృష్ణా బోర్డుకు రాష్ట్రం లేఖ

ఇంకా ఇండెంట్‌  సమర్పించని ఏపీ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల కింద రబీ అవసరాలకు నీటి కేటాయింపులు, ఇప్పటి వరకు జరిగిన వినియోగం, టెలిమెట్రీ పరికరాల బిగింపు, ప్రాజెక్టుల వర్కింగ్‌ మ్యాన్యువల్‌ వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16 లేదా 17న బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ శుక్రవారం బోర్డుకు లేఖ రాశారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు ఆశాజనకంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయని, ఈ దృష్ట్యా రబీ ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు వీలుగా సమావేశం ఏర్పాటుచేయాలని అందులో కోరారు. ఇప్పటికే ప్రభుత్వం తన సాగు, తాగు నీటి అవసరాల కోసం 122 టీఎంసీలు కోరిన విషయం తెలిసిందే. దీంతో పాటే మొదటి, రెండో దశ టెలీమెట్రీ స్టేషన్లను నిర్ధారించడం, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకొని తక్కువ చూపిన లెక్కలను సవరించడం, తమ అభిప్రాయానికి అనుగుణంగా వర్కింగ్‌ మాన్యువల్‌ను ఖరారు చేయడం వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని కోరింది.

వీటితోపాటు బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు ప్రకారం గృహాలకు పురపాలక సంఘాల్లో తాగునీటికి విడుదల చేసే నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెక్కల్లోకి తీసుకోవడం, గోదావరి నీటి మళ్లింపులో వాటా, హైదరాబాద్‌కు వాడే నీటిని ఉమ్మడి కేటాయింపుల్లోంచి తీసుకోవడం, చిన్ననీటి వనరుల కింద వాస్తవ వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎజెండాలో చేర్చాలని కోరింది. అయితే ఏపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఇండెంట్‌ సమర్పించలేదు. ఈ నేపథ్యంలో 16 లేదా 17న పెట్టాలని కోరుతున్న బోర్డు సమావేశంపై ఏపీ ఎలా స్పందిస్తుందన్నది సందేహంగా మారింది. వారు ఒప్పుకున్న పక్షంలోనే దీపావళికి ముందు సమావేశం జరుగనుంది. లేనిపక్షంలో పండుగ అనంతరమే సమావేశం ఉండనుంది.  

మరిన్ని వార్తలు