ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభించిన పువ్వాడ

19 Jun, 2020 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రైవేట్ సేవలు రద్దు చేశామని.. కార్గో, పార్సిల్ విభాగానికి కృష్ణకాంత్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని... ఇక ఈరోజు నుంచి పార్సిల్ సేవలను కూడా మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణానికి మంచి స్పందన ఉందని.. అలాగే వస్తువుల రవాణాపై కూడా నమ్మకం ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రూ. 180- 200 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ఈ సేవల్లో వాడుకుంటామని.. త్వరలోనే మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని పువ్వాడ తెలిపారు. అన్ని బస్‌స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా బుకింగ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో తీసుకురానున్నట్లు వెల్లడించారు.(తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు)

సంస్థ ఖర్చులతో వైద్యం
బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగడం లేదని పువ్వాడ అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మే 19 నుంచి తెలంగాణలో బస్సులు నడుపుతున్నామని... ఆర్టీసీ బస్సుల్లో అందరూ ధైర్యంగా ఎక్కవచ్చన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీపై త్వరలోనే జీవో తీసుకువస్తామని తెలిపారు. ఆర్టీసీ కష్టకాలంలో  ఉందని.. అందుకే అవసరం మేరకే బస్సులు తిప్పుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వస్తుందని తెలిపారు. అదే విధంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు 50శాతం జీతం ఇస్తున్నామని.. కరోనా లక్షణాలు ఉన్న సిబ్బందికి.. సంస్థ సొంత ఖర్చులతో పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు.(‘డిజిటల్‌’ ప్రయోగాలే శరణ్యం)

కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రైవేట్ పార్సిల్‌ ఏజెన్సీల ఒప్పందాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో సేవలందించిన కార్గో బస్సులు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మధ్య నిత్యావసర వస్తువులు, అంగన్వాడీ వస్తువులను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆర్టీసీకి మంచి ఆదాయం ఉంటుందన్నారు. దశల వారీగా పార్సిల్, కొరియర్ సర్వీసులను తీసుకొస్తామని తెలిపారు.


 

మరిన్ని వార్తలు