'సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయొద్దు'

15 Oct, 2019 08:51 IST|Sakshi

పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్టీసీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణ, పోలీసు శాఖ అధికారులతో సమ్మె ప్రభావంపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుందని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అసవరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అన్నారు.

సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి డిపోకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని, అద్దె బస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 100 శాతం బస్సులు నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇదే క్రమంలో అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు బస్సులు నడిపించడంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌దీపక్, జిల్లా రవాణశాఖ అధికారులు కిష్టయ్య, వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డీఎం మల్లేష్, రామగుండం అడిషనల్‌ డీసీపీ రవికుమార్, మంచిర్యాల డీసీపీ గౌస్‌బాబ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు