పీవీ.. అపర మేధావి

28 Jun, 2020 07:12 IST|Sakshi

నేటి నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు

సాక్షి, వరంగల్ :‌ పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు... దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి... ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన అపర చాణక్యుడు.. 9 భారతీయ భాషలతో పాటు 8 విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడిన బహుభాషా కోవిదుడు. స్వాతంత్య్రోద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు, మృదుస్వభావి, కవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలను, కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్న అచ్చమైన తెలుగుతేజం మన పీవీ. నేడు ఆయన శత జయంతి. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పీవీ జీవితంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

పోరాట వీరుడిగా... 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్‌ 28న రుక్నాబాయి–సీతారామారావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. దాదాపు మూడేళ్ల వయసులో కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లోనే అంటే 1938లో హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు.

దీంతో ఓయూ నుంచి ఆయనను బహిష్కరించడంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్‌లోనే అతని ఇంట్లో ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్‌ఎల్‌బీ చదివారు. స్వామీ రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలో, హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్‌ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. 

రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం... 
1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968–71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 

సొంత వర్గం లేకున్నా సీఎం పగ్గాలు... 
కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా నడిచిన నాటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేకున్నా పీవీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ నేతను సీఎంగా ఎంపిక చెయ్యడం అనివార్యమైంది. దీంతో వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలో ఏ వర్గానికీ చెందని ఆయన రాజకీయ నేపథ్యం 1971 సెప్టెంబర్‌ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. 

ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే.. 
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌ మధ్య తిరగడంతోనే సరిపోయేది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆం ధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలా మంది రాజీనామా చేశారు. దీంతో 1973 జనవరి 8న కొత్త వారితో పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. కానీ ఆ మర్నాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. అలా పీవీ ముఖ్యమంత్రి పదవి ముగిసింది.

ఎంపీ నుంచి  ప్రధాని వరకు... 
పీవీ 1977లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు హన్మకొండ నుంచి మరో రెండు పర్యాయాలు మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి, 1991లో ఏపీలోని నంద్యాల నుంచి, 1998లో ఒడిశాలోని బ్రహ్మపూర్‌ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1980–1989 మధ్య కేంద్రంలో హోం, విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను ఆయన చేపట్టారు. అయితే ఆయన్ను ప్రధాని పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్‌ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయాడు.

ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని, పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించడంతో ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన గంగుల ప్రతాపరెడ్డి చేత కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో పీవీని నిలిపింది. అలా పీవీ ఆ ఎన్నికలో గెలిచారు. తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా రాజనీతిజ్ఞతతో వ్యవహరించి ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన వెంటనే ‘లైసెన్స్‌ రాజ్‌’కు తెరదించి దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాటలో పరుగెత్తించారు. 

పీవీ ఇంటిపక్కనే  మ్యూజియం
పీవీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన ఇంటికి మెరుగులు దిద్దుతున్నారు. పురాతన భవనం పక్కనే నిర్మిస్తున్న భవన నిర్మాణం పూర్తయింది. ఆయన స్మారకార్థం పీవీ ఉపయోగించిన కుర్చీ, మంచం, కళ్లజోడు, ఆయన రాసిన, చదివిన పుస్తకాలు మొదలైన 100కి పైగా వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

వంగర.. సమస్యలతో సతమతం 
పీవీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా తనకున్న వెయ్యి ఎకరాల భూమిని వంగర, మంగళపల్లిలోని పేదలకు పంపిణీ చేశారు. అలాగే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. 1996లో ఆయన పదవికి దూరం కావడం.. 2004 డిసెంబర్‌ 23న పీవీ మరణించడంతో వంగర నిరాదరణకు గురైంది. పోలీస్‌ స్టేషన్, పీవీ మోడల్‌ కాలనీ, రక్షిత తాగునీటి బావి, సీసీ రోడ్ల నిర్మాణం, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్‌స్టేషన్, గ్రంథాలయ భవనం మంజూరయ్యాయి. టీటీడీ కళ్యాణ మండపం మంజూరైనా అది అనివార్య కారణాల వల్ల నిర్మించలేదు. ఇక మిగతా పనులన్నీ జరిగాయి. ప్రస్తుతం వంగర గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో తేలికపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వంగర నుంచి రత్నగిరికి, మంగళపల్లికి, మాణిక్యాపూర్‌కు వెళ్లే దారి గుంతల మయంగా మారింది. దీంతో తమ గ్రామ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా