త్వరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పోస్టల్ స్టాంప్

2 Jul, 2020 20:21 IST|Sakshi

చొర‌వ చూపిన‌ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ/హైద‌రాబాద్‌:: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మార‌కార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకొని పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార శాఖ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (అయ్యా నిజం చెప్పమంటారా...!)

పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితగా పీవీ నరసింహరావును కిష‌న్ రెడ్డి అభివర్ణించారు. ఆయ‌న‌ చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పీవీ పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు పేర్కొన్నారు. త్వరలో భారత ప్రభుత్వం పీవీ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. ఇది దేశానికి ఆయ‌న‌ చేసిన సేవలను గుర్తిస్తూ,  గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. (అచ్చమైన భారత రత్నం)

మరిన్ని వార్తలు