అశ్లీల చిత్రాలకు అడ్డుకట్ట వేయండి

14 May, 2019 09:25 IST|Sakshi

పీవైఎల్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సీపీకి వినతి

ముషీరాబాద్‌: యువతను పెడదారి పట్టించే డిగ్రీ కాలేజీ, ఏడు చేపల కథ తదితర సినిమాలను విడుదల కాకుండా  అడ్డుకోవాలని పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇటీవల వస్తున్న అశ్లీల సినిమాలు, సన్నివేశాలను నియంత్రించాలని కోరుతూ సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ను పీవైఎల్, పీడీఎస్‌యూ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ ప్రదీప్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రాములు మాట్లాడుతూ... 

ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో అశ్లీల దృశ్యాలు అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఫోర్న్‌ సీన్లు ఉంటేనే సినిమాలు చూస్తున్నారని దర్శక, నిర్మాతలు బహిరంగంగా పేర్కొనడం దారుణమన్నారు. తాజాగా ‘‘ డిగ్రీ కాలేజీ’’ ‘‘ఏడు చేపల కథ’’  తదితర అశ్లీల సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు. ఈ సినిమాలు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ, వీటికి ప్రధానంగా టీనేజీ యువతే ఆకర్షితులు అవుతున్నారని, పోస్టర్లు కూడా అసభ్యకరంగా వేస్తున్నారన్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో యువత వీటికి ప్రేరేపితులై చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు., ఇలాంటి సినిమాలను నిలిపివేయాలని, సదరు  దర్శక, నిర్మాతలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. ప్రతినిధి బృందంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.భాస్కర్, ఓయూ నాయకురాలు జ్యోతి,  పీవైఎల్‌ నాయకులు పి.సృజన్, కళ్యాణ్, డీవీఎస్‌.కృష్ణ తదితరులు ఉన్నారు.

పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు

మరిన్ని వార్తలు