బాబోయ్‌ కొండచిలువ.

19 Jul, 2018 11:32 IST|Sakshi
కొత్తగూడెం మున్సిపాలిటీ వద్ద కొండచిలువను పట్టుకున్న జిమ్‌ సంతోష్‌

భద్రాద్రి కొత్తగూడెం : బాబోయ్‌ కొండ చిలువ..అని భయపడి..దానిని చంపేయబోతుండగా స్నేక్‌ రెస్క్యూ సభ్యుడు జిమ్‌ సంతోష్‌ కాపాడి..వన్యప్రాణి సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అడవిలో వదిలేశారు. బుధవారం తెల్లవారుజామున మంచికంటినగర్‌లో బండ్ల ఉమ అనే మహిళ ఇంట్లోకి కొండచిలువ వచ్చింది. భయపడి అరవడంతో స్థానికులు దానిని చంపేద్దామంటూ కర్రలతో తలమీద కొట్టగా..9 అడుగుల పొడవుతో పైపైకి రావడంతో హడలిపోయారు.

సమాచారం అందుకున్న..స్నేక్‌రెస్క్యూ సభ్యుడు సంతోష్‌ అక్కడికి చేరుకుని..దానిని బంధించి విద్యానగర్‌ కాలనీలో పశువైద్యులు నర్సింహారావు వద్ద చికిత్స చేయించారు. అనంతరం కొత్తగూడెం మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకొచ్చి..ఈ వర్షాకాలం సీజన్‌లో పాములొస్తుంటాయని..తనకు సమాచారం ఇస్తే వాటిని రక్షించి, సురక్షిత ప్రాంతంలో వదిలేస్తానని..చంపేయొద్దని విజ్ఞప్తి చేశారు.

సర్పాలను ఎలా పట్టాలో కొంతసేపు అవగాహన కల్పించారు. అయితే..ఈ భారీ కొండచిలువను చేతులతో పట్టుకుని..అటూ ఇటూ పాకిస్తూ, ఆడిస్తూ ఉంటే..ఉద్యోగులు, స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా ఇలా క్లిక్‌మనిపించింది.                                 

మరిన్ని వార్తలు