టెక్నాలజీతో నాణ్యమైన ఫలితాలు

13 Mar, 2018 10:50 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఖాజీం నఖ్వీ

తెయూ(డిచ్‌పల్లి): టెక్నాలజీ వినియోగం మానవ జీవనంలో భాగమై పోయిందని మౌలానా అజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ ఖాజీం నఖ్వీ పేర్కొన్నారు. దైనందిన జీవనంలో ప్రతీ సందర్భంలోనూ సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరైందన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తాధ్వర్యంలో ‘రీసెంట్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ’ అంశంపై జరిగిన జాతీయ సెమినార్‌ తొలి రోజున నఖ్వీ కీలకోపన్యాసం చేశారు.

వ్యవసాయంతో పాటు విద్య, విజ్ఞానం, అంతరిక్షం వరకూ ప్రతి విషయంలోనూ సాంకేతిక పరిజ్ఞానం అవసరం తప్పనిసరిగా మారిందన్నారు. ఉన్నత విద్యారంగంలో డిజిటల్‌ విద్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా నాణ్యతతో కూడిన ఫలితాలు వస్తాయన్నారు. విద్య, వైద్యారోగ్య రంగాలతో పాటు ప్రతి అంశంలోనూ ఐటీ ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. 

నేటి యువత విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకున్నపుడే ఉజ్వలమైన భవిత సాధ్యమని టెక్‌ మహీంద్రా సంస్థ యూరోప్‌ హెడ్‌ మురళి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, సమయం ఆదా చేయడంతో పాటు చేసే ప్రతి పనిలోనూ ఫలితాలు ప్రయోజనకరంగా ఉండేలా చొరవ చూపాలని టెక్‌ మహీంద్రా సంస్థ అసోసియేట్‌ జనరల్‌ మేనేజర్‌ నరేశ్‌ నేటంకి సూచించారు. సాధించిన ఫలితాలే వ్యక్తిని, వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెడతాయని తెలిపారు. తెయూ సైన్స్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ విద్యావర్థని అధ్యక్షత వహించగా, సెమినార్‌ కన్వీనర్‌ ఆరతి ప్రాధాన్యతను వివరించారు.

మరిన్ని వార్తలు