ప్రయాణికుడే ‘ప్రథమం’

13 Mar, 2018 00:50 IST|Sakshi

శంషాబాద్‌ విమానాశ్రయ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు

త్వరలో ముఖ కవళికల నమోదు యంత్రాలు

వీటితో ప్రయాణికులకు తప్పనున్న తనిఖీ కష్టాలు.

పర్యావరణ హితమైన బయో టాయిలెట్లు

శానిటరీ న్యాప్‌కిన్స్‌ వెండింగ్‌ యంత్రాలు

‘సుగమ్య భారత్‌ అభియాన్‌’తో వృద్ధుల కోసం వీల్‌చైర్లు 

సాక్షి, హైదరాబాద్‌:శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు పడిగాపులు తప్పనున్నాయి. భద్రతా పరమైన తనిఖీల కోసం ఇక ఏమాత్రం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన కొద్ది సేపట్లోనే భద్రతా తనిఖీలను ముగించుకొని లోనికి వెళ్లిపోవచ్చు. ప్రయాణికుల సదుపాయాలకు అగ్రతాంబూలం ఇస్తూ ‘ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక రకాల సదుపాయాలను కల్పించిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో త్వరలో ముఖ కవళికల నమోదు (ఫేస్‌ రికగ్నైజేషన్‌) యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి.  

భద్రతా తనిఖీలు సులభతరం 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోప్రయాణికుల భద్రతా తనిఖీలు అతి ముఖ్యమైన ఘట్టం. భద్రతా అధికారులు ఒక్కొక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 3 గంటలు ముందుగా చేరుకోవలసి ఉంటుంది. అలాగే జాతీయ ప్రయాణికులు 2 గంటలు ముందుగా విమానాశ్రయానికి రావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా పరమైన తనిఖీలను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. పైగా అదే సమయంలో ప్రయాణికుల మొత్తం వివరాలను నిక్షిప్తం చేయడం వల్ల వారు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు. ఏ సమయం నుంచి ఏ సమయంలో విమానాశ్రయంలో ఉన్నారు వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో ప్రయాణికులకు మరింత పటిష్టమైన భద్రతను కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ‘ఫేస్‌ రికగ్నైజేషన్‌’ యంత్రాలనుప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రయాణికుల ఆధార్‌ కార్డులు, గుర్తింపు కార్డుల్లోని వివరాలతో సరిపోయే విధంగా రెటీనా స్కాన్‌ చేస్తున్నారు. ఫింగర్‌ ప్రింట్స్, బయోమెట్రిక్‌ తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. 

కాలింగ్‌ బెల్‌ నొక్కితే చాలు.. 
‘సుగమ్య భారత్‌ అభియాన్‌’సేవల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు, స్వతహాగా నడవలేని వారి కోసం ప్రస్తుతం వీల్‌చైర్లను అందుబాటులో ఉంచారు. అంధులైన వారి సమాచారం కోసం బ్రెయిలీ లిపిలో సైన్‌బోర్డులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత టర్మినల్స్‌కు చేరుకొనేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల్లోకి ప్రవేశించేందుకు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లేందుకు సహాయకులు, వీల్‌చైర్ల ద్వారా ప్రయాణికులకు సముచితమైన సేవలను అందజేస్తున్నారు. త్వరలో ఈ ఆటోమేటిక్‌ వీల్‌ చైర్‌ సదుపాయాన్ని పార్కింగ్‌ ప్రదేశం నుంచే కల్పించనున్నారు. ప్రయాణికులు తమ కారు పార్కు చేసిన చోట నుంచి కాలింగ్‌ బెల్‌ నొక్కితే చాలు. ప్రయాణికుల సహాయకులు నేరుగా కారు వద్దకే వచ్చి వీల్‌చైర్‌ సదుపాయాన్ని కల్పిస్తారు. 

అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఎక్స్‌ప్రెస్‌ సేవలు 
కేవలం ఒక హ్యాండ్‌ బ్యాగ్‌తో బయలుదేరే 40 శాతం డొమెస్టిక్‌ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ ఇన్‌ సదుపాయాన్ని త్వరలో అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నారు. టర్మినల్‌ ఎంట్రీ వద్ద ఉండే సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌ల ద్వారా హ్యాండ్‌ బ్యాగ్‌ ప్రయాణికులు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం సుమారు 18,000 మంది డొమెస్టిక్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ ప్రయాణికులకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. హ్యాండ్‌బ్యాగ్‌ ఇంటర్నేషనల్‌ ప్రయాణికులకు కూడా దీనిని వర్తింపజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 

‘క్యూ’కట్టాల్సిన పనిలేదు 
కొంతకాలంగా పైలట్‌ ప్రాజెక్టు కింద ఎయిర్‌పోర్టు సిబ్బందికి మాత్రం ఫేస్‌ రికగ్నైజేషన్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా సత్ఫలితాలు లభించడంతో ప్రయాణికుల భద్రతకు కూడా వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు సెక్యూరిటీ గేట్‌ వద్ద ఎక్కువ సమయం క్యూలో నించోవలసిన అవసరముండదు. పైగా రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వారి ట్రావెల్‌ హిస్టరీ సమోదై ఉంటుంది. దీంతో వారు అడుగడుగునా సెక్యూరిటీ తనిఖీల కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. నేరుగా వెళ్లిపోవచ్చు.  

బేబీ రూమ్స్‌ భేష్‌ 
ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌ కార్యక్రమాల్లో భాగంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బేబీ రూమ్స్‌ ప్రయాణికులకు ఎంతో సంతృప్తికరమైన సేవలందజేస్తున్నాయి. పిల్లలకు పాలు పట్టేందుకు, డైపర్‌లు మార్చేందుకు ఉపయోగపడుతున్నాయి. మహిళా ప్రయాణికుల కోసం ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ వెండింగ్‌ మిషన్‌లను వాష్‌రూమ్‌లలో 26 చోట్ల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో విమానాశ్రయంలో పర్యావరణ హితమైన బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు