ఇన్‌ సర్వీసు కోటా చిచ్చు

22 Mar, 2018 01:31 IST|Sakshi

పీజీ మెడికల్‌ అడ్మిషన్‌లో కోటా తొలగింపు

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య విద్య పీజీ సీట్ల అడ్మిషన్లలో కొత్త విధానం వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేవారికి పీజీ అడ్మిషన్లలో ఉండే ప్రాధాన్యతను తగ్గించడంపై వైద్య సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే రెగ్యులర్‌ వైద్యులకు కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత కల్పించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి గతంలో ఉన్న ప్రాధాన్యతను రద్దు చేశారు. దీంతో వైద్య సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం ముఖ్యులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పీజీ కౌన్సెలింగ్‌లో గతంలో ఉన్న 30% క్లినికల్, 50% నాన్‌ క్లినికల్‌ కోటాను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇన్‌ సర్వీసు కోటాలో పీజీ సీట్లు పొందాలనుకునే వైద్యులకు నష్టం కలుగుతుందన్నారు. ‘ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యులు ఎంతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వం ప్రవే శపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వైద్య సేవలు అందిస్తూ పీజీలో చేరాలనే వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి పీజీ ఇన్‌ సర్వీసు కోటాను మార్కులతో ముడిపెట్టకుండా గతంలో మాదిరిగా అమలు చేయాలి. సర్వీసు కోటాలో 30% క్లినికల్, 50% నాన్‌ క్లినికల్‌ వాటాగా అమలు చేయాలి’అని డిమాండ్‌ చేశారు. 

రేపటి నుంచి దరఖాస్తులు.. 
రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనుంది. మార్చి 23 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)తోపాటు రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ సీట్లలో అడ్మిషన్‌ పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన అర్హతలు, అభ్యర్థుల మెరిట్‌ జాబితా, కాలేజీల వారీగా సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు