‘హెల్త్‌ వర్సిటీ వీసీని తొలగించాలి’ 

26 Aug, 2019 03:02 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డిని తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని 14 బీసీ సంఘాలు హెచ్చరించాయి. ఆదివారం ఇక్కడ విద్యానగర్‌ బీసీ భవన్‌లో 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది. వీసీని తొలగించాలని ఆ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, ఫలితంగా 262 మందికి సీట్లు రాకుండా పోయాయని అన్నారు.

వీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మారారని, రాజ్యాంగ హక్కులను అమలు చేయకుండా ఈ వర్గాలపట్ల విషాన్ని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ కూడా అంగీకరించిందని తెలిపారు. అన్యాయాన్ని సరిదిద్దకుండా వైస్‌ చాన్సలర్‌ వితండవాదం చేస్తూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.

సుప్రీంకోర్టు కూడా మెరిట్‌ మార్కుల ప్రకారం మొదట ఓపెన్‌ కాంపిటీషన్‌ సీట్లు భర్తీ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్లు భర్తీ చేయాలని తీర్పు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు