మొత్తం ఖాళీలు భర్తీ చేయాలి

23 Oct, 2017 03:37 IST|Sakshi

8 వేల టీచర్‌ పోస్టులే భర్తీ చేయడంపై ఆర్‌.కృష్ణయ్య ఆగ్రహం  

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 40 వేల టీచర్‌ పోస్టులకు గాను మొక్కుబడిగా 8,792 ఖాళీలు మాత్రమే భర్తీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణల అధ్యక్షతన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. టీచర్‌ పోస్టుల ఖాళీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని విమర్శించారు.

2014 జూన్‌లో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ టీచర్‌ పోస్టులు 25,600 ఖాళీలు ఉన్నాయన్నారని ఆయన గుర్తుచేశారు. గత మూడున్నరేళ్ల కాలంలో రిటైర్‌ అయిన వారితో కలిపి మరో 15 వేల ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. ఖాళీలు లెక్కించడంలో విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకోవద్దని, 2012 నుంచి రిటైర్‌మెంట్‌వల్ల ఏర్పడ్డ ఖాళీలను ప్రాతిపదికగా తీసుకొవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్‌ పోస్టులు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 4,500 టీచర్‌ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2 వేలు, కసుర్బా పాఠశాలల్లో 1,200, కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులు 4 వేలు, పీఈటీ పోస్టులు 3 వేలు, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ పోస్టులు 2 వేలు, లైబ్రేరియన్‌ పోస్టులు 3 వేలు, జూనియర్‌ అసిస్టెంట్‌ 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

పరీక్షలు ఫిబ్రవరిలో కాకుండా జనవరి లేదా డిసెంబర్‌లో పెట్టాలని అన్నారు. ఒక వైపు 4,600 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే టీచర్‌ పోస్టులు భర్తీ చేయడానికి 9 నెలల కాలపరిమితి తీసుకోవడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు భూపేశ్‌ సాగర్, మహేందర్‌ గౌడ్, పగిల్ల సతీష్, జి.క్రిష్ణ యాదవ్, అనంతయ్య, యాదవ శ్రీనివాస్‌గౌడ్, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు