గవర్నర్‌ను కలిసిన ఆర్‌ కృష్ణయ్య

14 Sep, 2019 16:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ చాన్సిలర్‌ పోస్టుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం పోస్టులను కేటాయించాలని గవర్నర్‌ను ​కోరారు. యూనివర్సిటీ చాన్సిలర్‌ నియమాకంలో జోక్యం చేసుకొని జీసీలకు కోటా కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని.. సమర్ధులైన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. అయినప్పటికీ రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని.. బీసీల ఆందోళన గురించి కేంద్ర ప్రభుత్వనికి సిఫార్సు చేయాలని కోరారు. 

ప్రభుత్వ పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని,  జనాభా ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని బీసీలు కోరుకుంటే.. 22 శాతానికి తగ్గించడం ఎంతవరకు న్యాయమని ఆర్‌ కృష్ణయ్య ఈ సందర్భంగా గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కూడా జోక్యం చేసుకొని బీసీల హక్కులకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన మెడికల్‌ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల అమలు విషయంలో అక్రమాలు జరిగాయని.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో నెం. 550కి వ్యతిరేకంగా.. రిజర్వేషన్ల అమలు జరగకుండా అన్యాయం చేశారని దీనిపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. 

మరిన్ని వార్తలు